Kolkata, May 29: బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అనర్ (53) (Bangla MP Murder) హత్య కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతున్నది. కోల్‌కతాలో జరిగిన ఈ హత్య కేసులో దర్యాప్తు అధికారులు కొంత పురోగతి సాధించారు. ఆయన హత్యకు గురైనట్లు అనుమానిస్తున్న అపార్ట్‌మెంట్‌లోని సెప్టిక్ ట్యాంక్‌లో బెంగాల్ సీఐడీ (CID) దర్యాప్తు బృందాలు తాజాగా మాంసపు ముద్దలను గుర్తించాయి. మొత్తం మూడున్నర కిలోల మాంసం ముద్దలు, కొన్ని వెంట్రుకలు సెప్టిక్ ట్యాంక్‌లో లభ్యమైనట్లు ఓ దర్యాప్తు అధికారి వెల్లడించారు. వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించామని, డీఎన్‌ఏ (DNA) పరీక్షల్లో ఆ శరీర భాగాలు అనర్‌కు చెందినవో కావో తెలుస్తుందని చెప్పారు. కేసు దర్యాప్తులో భాగంగా ఆయన హత్యకు గురైన ఫ్లాట్‌లోని బాత్‌రూమ్ ద్వారా రక్తం మురుగునీటి పైపులగుండా వెళ్లినట్లు భావించామని పోలీసు అధికారి తెలిపారు. హౌసింగ్ కాంప్లెక్స్ బాధ్యుల సహాయంతో ఆ మురుగునీటి పైపులైన్లు, సెప్టిక్ ట్యాంకును పరిశీలించామని, ఈ క్రమంలోనే మాంసపు ముద్దలను గుర్తించామని చెప్పారు.
బంగ్లాదేశ్ అధికార పార్టీ అవామీ లీగ్‌కు చెందిన ఎంపీ అన్వరుల్ అజీమ్ (Azeem) వైద్య చికిత్స కోసం ఈ నెల 12న కోల్‌కతా వచ్చారు. తన స్నేహితుడికి చెందిన అపార్ట్‌మెంట్‌లో బస చేసిన ఆయన.. కొన్నిరోజుల తర్వాత కనిపించకుండా పోయారు. దీంతో రంగంలోకి దిగిన కోల్‌కతా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఓ మహిళ సహాయంతో నిందితులు ఆయనను హనీట్రాప్‌లోకి దింపి, ఆయన బస చేసిన అపార్ట్‌మెంట్‌లోనే గొంతు నులిమి చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ హత్యకు సంబంధించి నిందితుడిని అరెస్టు చేసి విచారిస్తున్నారు.
నిందితుడు వృత్తిరీత్యా కసాయి అని, ఎంపీని హత్య చేసిన అనంతరం శరీరాన్ని 80 ముక్కలుగా చేసి, వాటికి పసుపు కలిపి నగరంలోని బాగ్జోలా కాలువ, ఇతర ప్రాంతాల్లో పడేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. దర్యాప్తులో భాగంగా ఆయన శరీర భాగాల కోసం పోలీసులు ముమ్మరవేట ప్రారంభించారు. అయితే వాటిని గుర్తించడం పోలీసులకు కష్టసాధ్యంగా మారింది. ఇటీవల వర్షాలు కురవడంతో శరీర భాగాలు కొట్టుకొనిపోయి ఉంటాయని, జంతువులు కూడా వాటిని తినే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు బంగ్లాదేశ్‌కు చెందిన ముగ్గురు సభ్యులతో కూడిన బృందం కూడా కోల్‌కతాలో దర్యాప్తు చేస్తోంది.