Mumbai, January 30: వేతన సవరణ కోరుతూ బ్యాంక్ యూనియన్లు (UFBU) రేపు, ఎల్లుండి అంటే శుక్రవారం మరియు శనివారం రెండు రోజుల పాటు దేశవ్యాప్త సమ్మెను (Nationwide Bank Strike) చేపట్టనున్నాయి. దాదాపు పబ్లిక్ సెక్టార్ (PSU) బ్యాంకులన్నీ రెండు రోజుల పాటు విధులను బహిష్కరిస్తున్నట్లు ఇప్పటికే స్పష్టం చేశారు. కాబట్టి ఈ రెండు రోజుల పాటు బ్యాంకింగ్ సేవలలో అంతరాయం కలిగే అవకాశాలున్నాయి. .ఆ తర్వాత ఆదివారం ఎలాగూ సెలవు దినం, ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పబ్లిక్ సెక్టర్ బ్యాంకుల అధ్వర్యంలో నడిచే ఏటీఎంలపై బంద్ ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ 3 రోజుల్లో ఏటీఎంలలో (ATMs) నిధుల కొరత ఏర్పడవచ్చు.
కీలక సమయంలో బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు (Union Budget 2020) ప్రారంభం అవుతున్నాయి. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రసంగం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆ రెండు రోజులు బంద్ పాటించి బ్యాంక్ ఉద్యోగులు తమ నిరసన తెలియజేయనున్నారు. ఏదైనా బ్యాంకు లేదా ఫైనాన్స్ సంస్థపై ఫిర్యాదులా ? ఇలా చేయండి!
ఉద్యోగుల వేతన సవరణ శాతానికి సంబంధించి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) మరియు బ్యాంక్ యూనియన్ల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ ఉద్యోగులు ఈ బంద్ పాటిస్తున్నారు. నవంబర్ 17 నుంచి ఈ అంశం పెండింగ్ లోనే ఉందని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికీ తమ సమస్యను పరిష్కరించకపోతే, రెండో విడత బడ్జెట్ సమావేశాల సందర్భంగా మరోసారి మార్చి నెలలో కూడా మూడు రోజుల పాటు బంద్ పాటిస్తామని బ్యాంక్ యూనియన్లు హెచ్చరించాయి.