New Delhi, July 13: వింబుల్డ‌న్‌లో (Wimbledon 2024) కొత్త యువ‌రాణి కిరీటం అందుకుంది. మ‌హిళ‌ల సింగిల్స్‌లో బార్బొరా క్రెజికోవా (Barbora Krejcikova) విజేత‌గా అవ‌త‌రించింది. శ‌నివారం జ‌రిగిన ఉత్కంఠ పోరులో జాస్మినె ప‌వోలిని (Jasmine Paolini)కి షాకిచ్చి కెరీర్‌లోనే తొలి వింబుల్డ‌న్ ట్రోఫీని (Wimbledon 2024) కైవ‌సం చేసుకుంది. తొలి సెట్ గెలుపొంది జాస్మినెను ఒత్తిడిలో ప‌డేసి.. మూడో సెట్‌ను విజ‌యంతో ముగించి చాంపియ‌న్‌గా చ‌రిత్ర సృష్టించింది. ట్రోఫీతో పాటు బార్బొరా రూ.28.5 కోట్ల ప్రైజ్‌మ‌నీ సొంతం చేసుకుంది. సెమీఫైన‌ల్లో టాప్ సీడ్ ఎలెనా రిబాకినా (Elena Rybakina)కు షాకిచ్చిన బర్బొరా ఫైన‌ల్లోనూ దూకుడు క‌న‌బ‌రిచింది. తొలి సెట్‌ను 6-2తో గెలిచిన చెక్ భామ‌కు జాస్మినె రెండో సెట్‌లో గెలిచి పోటీనిచ్చింది. అయితే.. నిర్ణ‌యాత్మ‌క మూడో సెట్‌లో ఒత్తిడిని జ‌యించిన బ‌ర్బొరా పైచేయి సాధించింది. చివ‌ర‌కు 6-2,2-6, 6-4తో జ‌య‌భేరి మోగించి ట్రోఫీని ముద్దాడింది. ఇది ఆమెకు రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్. 2021లో బ‌ర్బొరా ఫ్రెంచ్ ఓపెన్ విజేత‌గా అవ‌త‌రించింది. ఇప్పుడు మ‌ళ్లీ గ్రాండ్‌స్లామ్ ట్రోఫీతో మెరిసి త‌న వింబుల్డ‌న్ క‌ల‌ను నిజం చేసుకుంది.

 

వింబుల్డ‌న్ ట్రోఫీతో చ‌రిత్ర సృష్టించాల‌నుకున్న ఇట‌లీ యువ‌కెర‌టం జాస్మినె క‌ల చెదిరింది. ఫ్రెంచ్ ఓపెన్ ర‌న్న‌ర‌ప్‌గా జేజేలు అందుక‌న్న ఈ యంగ్‌స్ట‌ర్ మ‌రోసారి ఆఖ‌రి మెట్టుపై త‌డ‌బ‌డింది. ఆడుతున్న‌ తొలి సీజ‌న్‌లో వింబుల్డ‌న్ ఫైన‌ల్లో అడుగుపెట్టిన జాస్మినె మ‌హిళల సింగిల్స్‌లో ఈ ఘ‌న‌త సాధించిన తొలి ఇట‌లీ అమ్మాయిగా రికార్డు నెల‌కొల్పింది. టైటిల్ పోరులో అమె గెలిచిఉంటే వింబుల్డ‌న్ ట్రోఫీ నెగ్గిన మొద‌టి ఇట‌లీ టెన్నిస్ ప్లేయ‌ర్‌గా కొత్త అధ్యాయం లిఖించేది.