New Delhi, December 5: కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నప్పటికీ కోవిడ్ సోకడంపై భారత్ బయోటెక్ స్పందించింది. మొదటి డోసుతో పాటు రెండవ డోసు (Covaxin Vaccine Update) కూడా తీసుకోవాలని రెండవ డోసు తీసుకున్న 14 రోజుల తర్వాతనే టీకా వల్ల సత్ఫలితాలు వస్తాయని భారత్ బయోటెక్ సంస్థ తెలిపింది. హర్యానా ఆరోగ్యశాఖ మంత్రి అనిల్ విజ్ (Anil Vij) కోవిడ్ డోసు తీసుకున్న తర్వాత కూడా కరోనా వైరస్ పరీక్షలో పాజిటివ్‌గా తేలారు.
కోవాగ్జిన్ టీకా (COVID-19 Vaccine) వేసుకున్న తర్వాత ఆయన పాజిటివ్‌గా తేలడం ఆందోళనకు దారితీసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ దీనిపై ఓ క్లారిటీ ఇచ్చింది. రెండు డోసులు ఉండే టీకాలో మంత్రి విజ్ కేవలం ఒక్క డోసును మాత్రమే తీసుకున్నట్లు ఆరోగ్యశాఖ చెప్పింది. దీనివల్ల అతనికి కోవిడ్ వచ్చి ఉండవచ్చని తెలిపింది.
రెండవ డోసు టీకా తీసుకున్న కొన్ని రోజుల తర్వాత శరీరంలో యాంటీబాడీలు ఉత్పన్నం అవుతాయని, అయితే కోవాగ్జిన్ రెండు డోసుల టీకా అని, మంత్రి అనిల్ విజ్ కేవలం ఒక్క డోసు మాత్రమే తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తన ప్రకటలో వెల్లడించింది. ట్రయల్స్‌లో పాల్గొనే వాలంటీర్లు 28 రోజుల తేడాలో రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకుంటారని ఆరోగ్యశాఖ చెప్పింది.
హైదరాబాద్‌కు చెందిన భారత్‌బయెటెక్ సంస్థ.. కోవాగ్జిన్ టీకాను అభివృద్ధి చేస్తున్నది. ఇటీవల జరిగిన మూడవ ట్రయల్స్‌లో వాలంటీర్ రూపంలో మంత్రి అనిల్ ఆ టీకాను తీసుకున్నారు. టీకా వేసుకున్న కొన్ని రోజులకు తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఇవాళ ట్వీట్ చేశారాయన. అంబాలా సివిల్ హాస్పిటల్ లో అడ్మిట్ అయినట్లు పేర్కొన్నారు.