New Delhi, February 6: టాటా సంస్థల అధినేత, పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాకు భారత రత్న (Bharat Ratna for Ratan Tata) ఇవ్వాలంటూ సోషల్ మీడియాలో ఓ ఉద్యమమే నడుస్తోంది. శుక్రవారం రోజున ట్విట్టర్‌లో భారతరత్న ఫర్ రతన్‌టాటా అన్న హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఇవాళ రతన టాటా ( Ratan Tata) తన ట్విట్టర్‌లో స్పందించారు. ఇలాంటి ప్రచారాలను మానివేయాలంటూ రతన్ టాటా ట్విట్టర్ యూజర్లను అభ్యర్థించారు.
భారతీయుడిని కావడం తన అదృష్టమని, దేశాభివృద్ధికి, సౌభాగ్యానికి కృషి చేయడం తనకు చాలా సంతోషకరమని చెప్పారు. అయితే తనకు ‘భారత రత్న’ ఇవ్వాలన్న డిమాండ్‌ను ఆపాలని కోరారు. ఓ అవార్డు విషయంలో కొందరు సోషల్ మీడియాలో ప్రచారం సాగిస్తున్నారని, అయితే వారి మనోభావాలను గౌరవిస్తానని, కానీ అలాంటి ప్రచారాలను నిలిపివేయాలని సగౌరవంగా వేడుకుంటున్నట్లు రతన్ టాటా తన ట్వీట్‌లో తెలిపారు.
భారతీయుడిగా పుట్టినందుకు గర్విస్తున్నానని, దేశ ప్రగతికి సహకరించేందుకు ఎప్పడూ ప్రయత్నిస్తూనే ఉంటానని రతన్ టాటా అన్నారు. మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ వివేక్ బింద్రా సోషల్ మీడియాలో ఇటీవల 100 బిలియన్ డాలర్ల విలువైన టాటా గ్రూప్ చైర్మన్ ఎమిరిటస్ రతన్ టాటాకు ‘భారత రత్న’ ఇవ్వాలని క్యాంపేయిన్ స్టార్ట్ చేశారు. రతన్ టాటాకు భారతరత్న ఇవ్వాలంటూ ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేసిన ట్వీట్ ట్రెండ్ అయ్యింది. ట్విట్టర్ యూజర్ల నుంచి వివేక్ ట్వీట్ కు భారీ మద్దుతు లభించింది. ఈ నేపథ్యంలో రతన్ టాటా తన ట్వీట్‌లో ఇవాళ స్పందించారు.
రతన్ టాటా 2012లో టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి వైదొలగారు. అప్పటి నుంచి ఆయన వ్యక్తిగత హోదాలో యువతను ప్రోత్సహిస్తున్నారు. స్టార్టప్ కంపెనీలను ఏర్పాటు చేసేవారిని ప్రోత్సహిస్తున్నారు.