Patna, September 23: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో పతాక శీర్షికల్లో నిలిచిన బీహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. బిహార్ ముఖ్యమంత్రిని విమర్శించినందుకు గాను రియా చక్రవర్తిపై మండి పడటమే కాక.. ఆమెకు ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయి లేదంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన డీజీపీ గుప్తేశ్వర్ పాండే (Bihar DGP Gupteshwar Pandey) తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో కొత్తగా ఎస్ కె సింఘాల్ (Sanjiv Kumar Singhal) నియమితులయ్యారు.
అందుకు కారణాలను ఆయన బుధవారంనాడు మీడియాకు వెల్లడించారు. వీఆర్ఎస్ తీసుకోవడం తన రాజ్యాంగపరమైన హక్కు అని అన్నారు. రెండు నెలలుగా తాను ఎంతో మనస్తాపానికి గురయ్యారని, జీవితం దుర్భరంగా అనిపించిందని అన్నారు. 'నా రిటైర్‌మెంట్ ఎప్పుడంటూ వేలాది ఫోన్ కాల్స్ వచ్చాయి. బాగా విసిగిపోయాను' అని గుప్తేశ్వర్ పాండే తెలిపారు. బీహార్ పోలీసుల పట్ల ముంబై పోలీసులు అనుచితంగా ప్రవర్తించినప్పుడే తాను పోరాటం చేయాలని నిర్ణయించుకున్నానని, బీహార్ ప్రతిష్ట కోసం పోరాడాలనుకున్నానని పాండే చెప్పారు.
సుశాంత్ కేసుతో (Sushant Singh Rajput Death Case) తన వీఆర్ఎస్‌కు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. సుశాంత్ వృద్ధ తండ్రికు సహాయంగా నిలబడాలని అనుకున్నానని, సుశాంత్ కేసులో ఎఫ్ఐఅర్ నమోదు చేయాలని బీహార్ పోలీసులు తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కూడా సమర్ధించిందని చెప్పారు. 34 ఏళ్ల సుదీర్ఘ సర్వీసులో ఏ నేరస్థుడి విషయంలోనూ తాను రాజీపడలేదని, 50 ఎన్‌కౌంటర్లలో పాల్గొన్నానని చెప్పారు. అయితే రాజకీయాల్లో చేరడానికి పాండే రాజీనామా చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే వచ్చే నెలలో బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో పాండే స్వచ్ఛంద పదవీ విరమణ (Voluntary Retirement) చేయడంతో ఎన్నికల్లో పోటీ చేస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 1987 బిహార్ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి గుప్తేశ్వర్ పాండే బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు దర్యాప్తులో భాగంగా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఇక పాండే రాజీనామా అభ్యర్థనకు సంబంధించి నోటిఫికేషన్ హోంశాఖ జారీ చేసింది. ఇక నిన్నటితో ఆయన వర్కింగ్ డేస్ పూర్తయ్యాయి.
డీజీపీ రాజకీయాల్లో చేరతారంటూ వస్తోన్న వార్తలపై ఆయన స్పందించారు. ‘నేను ఇప్పటి వరకు ఏ పార్టీలో చేరలేదు.. దీని గురించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నాకు సమాజ సేవ చేయాలని ఉంది. అందుకుగాను రాజకీయాల్లోనే చేరాల్సిన అవసరం లేదు’ అని స్పష్టం చేశారు. ఇక పాండే గతంలో కూడా స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. రాజకీయాల్లో చేరి.. బీజేపీ టికెట్ పొందాలని ఆశించారు. కానీ అవకాశం లభించలేదు. దాంతో ఉద్యోగానికి రాజీనామా చేసిన 9 నెలల తర్వాత తిరగి తనను విధుల్లోకి తీసుకోవాల్సిందిగా బిహార్ ప్రభుత్వాన్ని కోరారు. అతని అభ్యర్థన మేరకు నితీష్ కుమార్ 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు పాండేని విధుల్లోకి తీసుకున్నారు.
ఇదిలా ఉంటే పాండే 2014లో వాలంటరీ రిటైర్‌మెంట్‌కు రిక్వెస్ట్ పెట్టుకున్నారు. ఆయన రాజకీయాల్లోకి వస్తారని, బీజేపీ నుంచి టిక్కెట్ వస్తుందని అనుకున్నారు. అయితే ఆయనకు బీజేపీ టిక్కెట్ దొరకలేదు. వీఆర్ఎస్ తీసుకున్న తొమ్మిది నెలలకు ఆయన తన రాజీనామా ఉపసంహరించుకునేందుకు అనుమతించాలంటూ బీహార్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నితీష్ కుమార్ ప్రభుత్వం అందుకు అంగీకరించడంతో మళ్లీ ఆయన విధుల్లోకి చేరారు. 2019 బీహార్ లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆయన డీజీపీ అయ్యారు.