Gaya, Sep 5: బీహార్ రాష్ట్రంలోని గయా జిల్లాలో సభ్య సమాజం తల దించుకునే ఘటన (Bihar Shocker) చోటు చేసుకుంది. వివాహిత అయిన తనపై కన్నతండ్రే తరచూ అత్యాచారానికి (Woman Raped Repeatedly by Father) పాల్పడుతున్నాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయాలని ప్రయత్నించింది.
అయితే , గయా ఎస్ఎస్‌పీతోపాటు మహిళా పోలీస్‌స్టేషన్లో పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఓ మహిళ తన ఎనిమిదేండ్ల కూతురును చంపేసి, తాను ఆత్మహత్య (Kills Her Baby Before Committing Suicide) చేసుకుంది. గయా జిల్లా ముఫాసిల్ పోలీస్ స్టేషన్ ఏరియాలోని లఖీబాగ్ ఏరియాలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
దారుణ ఘటన వివరాల్లోకి వెళ్తే.. లఖీబాగ్ ఏరియాలో ఓ 28 ఏండ్ల వివాహిత మహిళపై ఆమె తండ్రి తరచూ అత్యాచారానికి పాల్పడుతున్నాడు. విషయం బయటచెబితే పరువు పోతుందని బెదిరిస్తూ వీలు చిక్కినప్పుడల్లా అఘాయిత్యం చేస్తున్నాడు. దాంతో విసిగిపోయిన బాధితురాలు వారం రోజుల క్రితం గయా ఎస్ఎస్‌పీకి ఫిర్యాదు చేసింది. ఆయన సూచన మేరకు స్థానిక మహిళా పోలీస్‌స్టేషన్‌లో కూడా కంప్లెయింట్ ఇచ్చింది. కానీ పోలీసులు ఆమె ఫిర్యాదును పట్టించుకోలేదు. అది కుటుంబ తగాదా అని, ఇంట్లో తేల్చుకోవాలని చెప్పి పంపించారు.
బాధితురాలు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడంతో నిందితుడు మరింత రెచ్చిపోయాడు. ఫిర్యాదు చేసి వచ్చిన తర్వాత కూడా ఆమె అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నిందితుడి ఇంట్లోనే బతుకుతుండటంతో బాధితురాలి భర్త కూడా మామ అఘాయిత్యాన్ని ప్రశ్నించే ధైర్యం చేయలేకపోయాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి బాధితురాలు తన ఎనిమిదేండ్ల కూతరును గొంతు నులిమి చంపేసి తను కూడా సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
ఈ ఘటనపై బాధితురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శనివారం రాత్రి తాను ఇంటికి వెళ్లి చూసేసరికి తమ గదిలో మంచంపై తన కూతురు విగత జీవిగా పడి ఉందని, భార్య ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించిందని అతను ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆ దృశ్యాలు చూసి తట్టుకోలేక తాను కూడా అదే ఫ్యాన్‌కు ఉరేసుకున్నానని, కానీ ఇంతలో ఇరుగుపొరుగు వాళ్లు వచ్చి తనను రక్షించారని తెలిపాడు. తన భార్య ఫిర్యాదు చేసినప్పుడు పోలీసులు పట్టించుకుని ఉంటే ఇంత ఘోరం జరిగేది కాదని అతను విలపించాడు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.