Rahul Gandhi (Photo Credits: Instagram)

New Delhi, April 5: చ‌త్తీస్‌ఘ‌డ్‌లోని బీజాపూర్ వ‌ద్ద జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌పై (Bijapur Naxal Attack) కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ స్పందించారు. మావోల‌తో జ‌రిగిన ఎదురుకాల్పుల్లో సుమారు 22 మంది జ‌వాన్లు వీర మ‌ర‌ణం పొందారు. మన జవాన్లను అతి తేలిగ్గా ఫిరంగి గుళ్లకు బలి చేయడం ఎంతమాత్రం అంగీకారయోగ్యం కాదు' అని రాహుల్ అభిప్రాయపడ్డారు. చాలా అస‌మ‌ర్థ రీతిలో (Incompetently Executed Operation) భ‌ద‌త్రా ద‌ళాలు ఆ ఆప‌రేష‌న్ చేప‌ట్టాయని రాహుల్ విమ‌ర్శించారు.

ఇవాళ ట్విట్ట‌ర్‌లో ఆయ‌న స్పందిస్తూ.. చాలా బ‌ల‌హీన‌మైరీతిలో బ‌ల‌గాలు ప్ర‌ణాళిక‌లు వేశాయ‌ని విమ‌ర్శించారు. మ‌న జ‌వాన్లను తక్కువగా చూడ‌రాదు అని, ఎటువంటి స‌దుపాయాలు క‌ల్పించ‌కుండానే బ‌ల‌గాలను నిర్వీర్యం చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. ప్ర‌భుత్వం ద‌ళాల‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న రీతిలో రాహుల్ త‌న ట్విట్ట‌ర్‌లో రియాక్ట్ అయ్యారు.

సీఆర్‌పీఎఫ్ ద‌ళంలోని 8 మంది, కోబ్రా క‌మాండోలు ఏడుగురు, బ‌స్త‌ర్ బెటాలియ‌న్‌కు చెందిన ఒక్క‌రు, డీఆర్‌జీ ద‌ళానికి చెందిన 8 మంది, స్పెష‌ల్ టాస్క్ ఫోర్స్‌కు చెందిన అయిదుగురు న‌క్స‌ల్స్ దాడిలో ప్రాణాలు కోల్పోయారు. ఇంటెలిజెన్స్ త‌ప్పుడు స‌మాచారం ఇవ్వ‌డం వ‌ల్ల ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. కానీ సీఆర్‌పీఎఫ్ డైర‌క్ట‌ర్ జ‌న‌ర‌ల్ కుల్దీప్ సింగ్ మాత్రం ఈ ఆప‌రేష‌న్‌లో ఇంటెలిజెన్స్ ఇచ్చిన స‌మాచారంలో ఎటువంటి లోపం లేద‌న్నారు.

ప్లాన్ ప్రకారమే మావోయిస్టుల దాడి, అమరులైన 22 మంది జవాన్లు, 21 మంది మిస్సింగ్, గాయాలతో 30 మంది, ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌ ఘటనపై హోంమంత్రి అమిత్‌ షా ఆరా, జవాన్ల మృతి పట్ల సంతాపం ప్రకటించిన ప్రధాని మోదీ

అయితే రాహుల్ త‌న ట్విట్ట‌ర్‌లో సీఆర్‌పీఎఫ్ డైర‌క్ట‌ర్ వ్యాఖ్య‌ల‌ను జ‌త చేస్తూ.. ప్ర‌భుత్వ బ‌ల‌గాలు చేప‌ట్టిన ఆప‌రేష‌న్‌ను త‌ప్పుప‌ట్టారు. ఒక‌వేళ ఇంటెలిజెన్స్ వైఫ‌ల్యం లేకుంటే, అప్పుడు మ‌ర‌ణాల రేటు 1-1గా ఉందంటే ఆ ఆప‌రేష‌న్ లో లోపం ఉంద‌ని, అస‌మ‌ర్థ రీతిలో దాన్ని అమ‌లు చేశార‌ని రాహుల్ విమ‌ర్శించారు.

ఇది 21వ శతాబ్దం, ఏ ఒక్క భారత జవాను కూడా శరీర రక్షణ కవచం లేకుండా శత్రువును ఎదుర్కోరాదని స్పష్టం చేశారు. శరీర రక్షణ కవచాలను ప్రతి ఒక్క సైనికుడికి అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.