Jodhpur, AUG 14: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) 24 సంవత్సరాల కిందట చంపిన కృష్ణ జింక (blackbuck) కోసం రాజస్థాన్‌లో స్మారక చిహ్నాన్ని నిర్మిస్తున్నారు. బిష్ణోయ్ (Bishnoi Community) సొసైటీ తరఫున జోధ్‌పూర్ జిల్లాలోని కంకణి గ్రామంలో స్మారకాన్ని నిర్మిస్తుండగా.. ఇందులో 800 కిలోల బరువునున్న కృష్ణ జింక విగ్రహాన్ని (blackbuck memorial) ఏర్పాటు చేయనున్నారు. అడవిలో సహజంగా మరణించిన జింక అవశేషాలను జింక విగ్రహం తయారీకి సేకరించారు. బిష్ణోయ్ సమాజంలోని ప్రజలు కృష్ణ జింకలను సాంపద్రాయం, మతపరంగా వాటిని పవిత్రంగా భావిస్తారు. కంకణి (Kankani) గ్రామంలో దాదాపు ఏడు బిఘాల స్థలంలో నిర్మిస్తున్న స్మారక చిహ్నంలో అత్యాధునిక జంతు సంరక్షణ కేంద్రం సైతం నిర్మిస్తున్నారు. సల్మాన్ ఖాన్ కృష్ణజింకను చంపిన ప్రదేశంలోనే ఈ స్మారక నిర్మాణాన్ని చేపడుతున్నారు.
గ్రామస్తులంతా డబ్బులు సేకరించి.. ఈ స్మారకాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు కృష్ణ జింక విగ్రహాన్ని సైతం సిద్ధం చేశారు. దీన్ని జోధ్‌పూర్‌కు చెందిన కళాకారుడు శంకర్ 15 రోజుల్లోనే సిద్ధం చేశాడు. ఈ సందర్భంగా బిష్ణోయ్ సంఘం నేత, మాజీ ఎంపీ జస్వంత్ సింగ్ బిష్ణోయ్ మాట్లాడుతూ తల తెగినా తమ వైఖరి మాత్రం జింకలేనని, గుర్తింపును కాపాడుకునేందుకు రక్షణ అవసరమన్నారు.
ఇదిలా ఉండగా.. 1998 సెప్టెంబర్ 26 నుంచి 28 వరకు జోధ్‌పూర్‌లోని భవద్, మథనియా గ్రామాల్లో హమ్ సాథ్ సాథ్ హై సినిమా షూటింగ్ కోసం సల్మాన్ ఖాన్ వచ్చాడు. ఆ సమయంలో రెండు కృష్ణ జింకలను వేటాడాడు. వన్యప్రాణి సంరక్షణ చట్టంలోని సెక్షన్ 51 ప్రకారం జింకలను చంపిన కేసులో సల్మాన్‌కు ఐదేళ్ల జైలు శిక్ష పడింది. ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నాడు. ఈ కేసులో నటులు సైఫ్ అలీఖాన్, టబు, నీలం, సోనాలి బింద్రే సైతం నిందితులుగా ఉండగా.. సాక్ష్యాలు లేకపోవడంతో వారిని కోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది.