Imphal, AUG 12: ఆయన మణిపూర్ కు చెందిన నాయకుడే. పైగా అధికార భారతీయ జనతా పార్టీ మిత్రపక్షమైన నాగా పీపుల్స్ పార్టీ సభ్యుడు. అలాంటి ఆయనే సొంత రాష్ట్రంలో సర్జికల్ దాడులు చేయాలని కేంద్రానికి సలహా ఇచ్చారు. ఆయన పేరు ఆర్.రామేశ్వర్ సింగ్. మూడు నెలలుగా అగ్ని కిలల్లో దగ్దమవుతున్న తరుణంలో రామేశ్వర్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆందోళన రేకెత్తించే అవకాశం ఉందని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో జరిగిన అల్లర్ల కారణంగా అధికారికంగా 150 మందికి పైగా మరణించారు. ఇక వందలాది మంది తీవ్రంగా గాయపడగా.. వేలాది మంది నిరాశ్రాయులయ్యారు. ఇక రాష్ట్రంలో పరిస్థితిపై తాజాగా రామేశ్వర్ స్పందిస్తూ ‘‘సరిహద్దు దాటి దురాక్రమణదారులు, కుకీ తీవ్ర వాదులు రాష్ట్రంలోకి వచ్చారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పింది నిజమే. ఇందులో బయటి దురాక్రమణదారుల ప్రమేయం ఉందని నేను ఎప్పటినుంచో చెబుతున్నాను. దీని వల్ల జాతీయ భద్రత కూడా ప్రమాదంలో పడింది. ఒక్క మణిపూర్ రాష్ట్రమే కాదు, దీనికి వల్ల దేశానికి కూడా చాలా ప్రమాదం ఉంది. సర్జికల్ దాడుల వంటి కొన్ని ప్రభావవంతమైన చర్యలు తీసుకుంటేనే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది’’ అని అన్నారు.
VIDEO | "It is clear that some illegal immigrants and militants are coming (into Manipur) from across the border. It is important for us to save not only Manipur but also the entire nation. Some effective action like surgical strike should be done to solve the problem for once… pic.twitter.com/3FqJSGDOYt
— Press Trust of India (@PTI_News) August 11, 2023
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘ప్రస్తుతం కుకీ మిలిటెంట్లంతా శిబిరాల్లో ఉన్నారు. వారి వద్ద సకల ఆయుధాలు ఉన్నాయని కొన్ని ఏజెన్సీలు కథనాన్ని రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీనిపై నేను కేంద్ర మంత్రిని అభ్యర్థించాను. ఇలాంటి ప్రచారాల వల్ల మణిపూర్ ప్రజలకు పలు అనుమానాలు వస్తున్నది. అగ్ని ఎక్కడ నుంచి వస్తోంది? అవతలి వైపు నుంచి ఎవరు కాల్పులు జరుపుతున్నారన్నది మనం గమనించాలి’’ అని అన్నారు.
మణిపూర్ నుంచి వచ్చే శరణార్థుల డేటాను సేకరించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో బయోమెట్రిక్ ద్వారా డేటా సేకరణ ప్రారంభించింది. ఒక్క జూలైలోనే మయన్మార్ నుంచి సుమారు 700 మంది అక్రమంగా మణిపూర్ రాష్ట్రంలోకి చొరబడ్డారని మణిపూర్ ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. ఆ రాష్ట్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో అల్లర్లు జరుగుతున్న సమయంలో జూలై 22, 23న మొత్తం 718 మంది (అందులో 301 చిన్నారులు) మణిపూర్ సరిహద్దు లోపలికి ప్రవేశించారని పేర్కొన్నారు.
మైతీ గిరిజనుల రిజర్వేషన్లు సాధిస్తే తమను దోచుకుతింటారని కుకి గిరిజనులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం, రాష్ట్రంలోని కొండ ప్రాంతాల్లో మైతీ వర్గం స్థిరపడేందుకు వీలు లేదు. ఇదే నిరసనకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే బలంగా ఉన్న మైతీ వర్గం ప్రజలు తమ పర్వతాలను కూడా ఆక్రమిస్తారని కుకీ కమ్యూనిటీ ప్రజలు భావిస్తున్నారు.
మే 3 నుంచి మైతీలు, కుకీల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ హింసాత్మక సంఘటనల్లో దాదాపు 160 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలోని 10 శాతం భూభాగంలో మైతీలు ఉంటారు. కుకీలు, నాగాలు ఎస్టీ వర్గంలోకి వస్తారు. వీరు రాష్ట్రంలోని దాదాపు 90 శాతం భూభాగంలో ఉంటారు. మెయిటీలు రాష్ట్ర జనాభాలో 53 శాతం కాగా.. కుకీలు, నాగాలు కలిపి 40 శాతం వరకు ఉంటారు.
మణిపూర్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ఎంవీ మురళీధరన్‌తో కూడిన ధర్మాసనం మార్చి 27న మైతీ, కుకీల మధ్య పోరు ఏమిటనే అంశంపై తీర్పునిచ్చింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం మైతీ వర్గాన్ని కూడా ఎస్టీ కేటగిరీలో చేర్చాలని కోరారు. హైకోర్టు ఇచ్చిన ఈ ఉత్తర్వు చట్టవిరుద్ధమని కుకీ సంఘం పేర్కొంది. మణిపూర్‌లో ప్రధానంగా మైతీ, కుకి, నాగ కులాలు నివసిస్తున్నాయి. నాగా, కుకి ఇప్పటికే గిరిజన హోదాను కలిగి ఉన్నాయి. కానీ 1949లో ఈ హోదా నుంచి మైతీలను తొలగించారు. అప్పటి నుంచి మైతీ వర్గం ప్రజలు తమకు గిరిజన హోదా కావాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశం సుప్రీంకోర్టులో ఉంది.