Dehradun, Jul 3: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో బీజేపీ ఎమ్మెల్యేలు వరుసగా అత్యాచారం కేసుల ఆరోపణల్లో ఇరుక్కుంటున్నారు. మొన్నటికి మొన్న ద్వారహత్ ఎమ్మెల్యే మహేష్ నేగి అత్యాచార ఆరోపణలు ఎదుర్కోగా తాజాగా ఉత్తరాఖండ్ జ్వాలాపూర్ బీజేపీ ఎమ్మెల్యే సురేష్ రాథోడ్‌పై (Jwalapur MLA Suresh Rathore) అత్యాచారం కేసు నమోదైంది. బేగంపురా గ్రామానికి చెందిన పార్టీ మహిళా కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ అనంతరం కేసు నమోదు (BJP MLA Booked on Rape Charges) చేశామని పోలీసులు తెలిపారు.
కోర్టు ఆదేశాల మేరకు ఎమ్మెల్యే సురేష్ రాథోడ్‌పై ఐపీసీ సెక్షన్ 376, 504,506, సీఆర్పీసీ యాక్ట్ 156 (3)ల కింద కేసు నమోదు చేసినట్టు హరిద్వార్ సీనియర్ పోలీసు అధికారి అబుదాజ్ కృష్ణరాజ్ చెప్పారు. కాగా కొన్ని నెలల క్రితం సురేష్ రాథోడ్ అత్యాచారానికి పాల్పడినట్లు బాధిత మహిళ ఫిర్యాదులో తెలిపింది. ఈ విషయం గురించి బయటపెడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరించినట్టు ఆరోపించింది.
జ్వాలాపూర్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న సురేష్ రాథోడ్ తనపై వచ్చిన ఆరోపణలను కొట్టిపారేశారు. అంతేకాకుండా తన ప్రాణానికి ప్రమాదం ఉందని పేర్కొంటూ పోలీసులు రక్షణ కల్పించాలని ఆయన కోరారు. ఆయన మీడియాతో మాట్లాడూతూ.. నా జీవితం ప్రమాదంలో ఉంది. నేను ఇంతకు ముందే చెప్పాను. కొంతమంది నాపై కుట్రలు చేస్తున్నారు. తప్పుడు ఆరోపణలతో కేసు కూడా నమోదు చేశారు. సమగ్ర దర్యాప్తు చేసి వాస్తవాలు బయట పెట్టాలని పోలీసులను డిమాండ్ చేశారు.