Polavaram Project: కేంద్రమే పోలవరాన్ని పూర్తి చేయాలి, రాజ్యసభలో ఎంపి కెవీపీ రామచంద్రరావు, పోలవరంపై తెలుగులో మాట్లాడిన బీజేపీ ఎంపీ జీవీఎల్,ఆడిట్ పూర్తయ్యాక నిధులు విడుదల చేస్తామన్న కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్‌
Polavaram Project(Photo-wikimedia commons)

New Delhi, December 10: పార్లమెంటు సమావేశాల సందర్భంగా  రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు, బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు(BJP MP GVL Narasimha rao) రాజ్యసభలో(Rajyasabha) పోలవరం అంశాన్ని లేవనెత్తారు. రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు మాట్లాడుతూ..పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని కేంద్రాన్ని కోరారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించినందున… పూర్తి చేసే బాధ్యతను కేంద్రమే తీసుకోవాలన్నారు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పోలవరం ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)కు జీవనాడి అన్న కేవీపీ ( MP KVP Ramachandra rao) ప్రాజెక్టును పూర్తిచేస్తే రాష్ట్రానికి ఎంతో మేలు చేకూరుతుందని చెప్పారు.

జీవీఎల్ మాట్లాడుతూ పోలవరంపై(Polavaram) రాష్ట్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీ వేసి, ప్రాజెక్టుపై రూ.2375 కోట్ల అదనపు వ్యయం చెల్లింపులు చేశామని చెప్పిందని, దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉందని అన్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో బాధ్యతలు తీసుకుని మిగతా నిధులు కూడా విడుదల చేసి ఈ ప్రాజెక్టు సకాలంలో పూర్తయ్యేందుకు సహకరించాలనిలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కల సాకారం అయ్యేందుకు తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రాజెక్టు అంశంలో కేంద్రం ప్రభుత్వం రాష్ట్రంతో సంప్రదింపులు జరిపి, నిర్వాసితుల అంశాన్ని కూడా పరిష్కరించాలని జీవీఎల్ కోరారు. కాగా సభలో జీవీఎల్ పూర్తిగా తెలుగులోనే మాట్లాడారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు(Polavaram Project) ఖర్చును పూర్తిగా కేంద్రమే భరిస్తుందని ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు. పోలవరం కోసం రాష్ట్రానికి ఇప్పటికే 6 వేల 764 కోట్లను కేంద్రం ఇచ్చిందని తెలిపారు.

పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడానికి ముందు చేసిన రూ.5వేల కోట్ల వ్యయంపై కేంద్ర ఆర్థిక శాఖ ఆడిట్‌ జరుపుతోంది. ఆ ఆడిట్‌ పూర్తయ్యాక నిధులు విడుదల చేయడం జరుగుతుందని కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్‌ (Gajendra shekhawat) తెలిపారు. ఈ మేరకు ఆయన పార్లమెంటులో ఒక ప్రకటన చేశారు.

పోలవరం ప్రాజెక్టు పనులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న రూ.3,222.75 కోట్లు విడుదల చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తితో పాటు ఈ ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన నిర్మాణ వ్యయం అంచనాలను ఆవెూదించే అంశాలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందా అంటూ రాజ్యసభలో ఎంపీ విజయసాయి ప్రశ్నకు కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్‌ బదులిచ్చారు.

రూ. 5వేల కోట్ల ఖర్చుకు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ ఆడిట్‌ జరుపుతోందని తెలిపారు. ఇప్పటి వరకు రూ.3వేల కోట్ల మేరకు ఆడిట్‌ పూర్తయినందున అందులో కొంత మొత్తం విడుదల చేసే అంశాన్ని ఆర్థిక శాఖ పరిశీలిస్తోందని అన్నారు.