PV Express Highway near Rajendranagar. | File Image.

Hyderabad, September 08: హైదరాబాద్ లోని రాజేంద్రనగర్‌లో ఆదివారం పేలుడు సంభవించింది. అగ్రికల్చర్ వర్శిటీకి సమీపంలో వీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నెంబర్ 279- 280 వద్ద ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. చెత్తను ఏరుకునే అలీ అనే ఒక 40 ఏళ్ల యాచకుడు రోడ్డు పక్కన కనిపించిన ఒక పాలీథీన్ కవర్ ను తెరిచినపుడు ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు చోటు చేసుకుంది. పేలుడు ధాటికి ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. అతడి శరీర భాగాలు 10 మీటర్ల దూరం వరకు ఎగిరి పడ్డాయని ప్రత్యక్ష సాక్షుల ద్వారా తెలుస్తుంది.  గాయపడిన మరో వ్యక్తిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

సమాచారం అందుకున్న హైదరాబాద్ సిటీ పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని ఆ ప్రాంతమంతా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పేలుడుకు సంబంధించిన వివరాలు సేకరించారు, డాగ్ స్క్వాడ్ ద్వారా ఘటనాస్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. సీసీ కెమెరాల ఫుటేజ్ ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కెమికల్స్ గల టిఫిన్ బాక్స్ పేలినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.

చెత్త సేకరించే అలీ, డంప్ యార్డులో పడేసిన ఒక అనుమానాస్పద కవర్‌లో ఉన్న టిఫిన్ బాక్సును ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ దగ్గరకు తీసుకొచ్చి ఓపెన్ చేయడం వల్ల ఈ సంఘటన జరిగింది. నిమజ్జనాలు జరుగుతున్న సందర్భంగా నిన్న రాత్రే ఇక్కడ గణేశ్ శోభయాత్ర జరిగింది. ఈ పేలుడు ఘటన శోభయాత్ర జరుగుతున్నపుడు సంభవించి ఉంటే నష్టం ఇంకా ఎక్కువగా జరిగి ఉండేది. ఈ నేపథ్యంలో ఈ పేలుడు ఘటన వెనక ఏదైనా కుట్ర దాగి ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.