Nagpur, OCT 15: అనుకూల తీర్పు ఇవ్వాలంటూ ఏకంగా హైకోర్టు బెంచ్‌ను (Nagpur Bench) బెదిరింపులకు గురిచేసిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఓ ప్రాపర్టీ టాక్స్ కేసులో అనుకూల తీర్పు ఇవ్వకుంటే ఇద్దరు న్యాయమూర్తులపై బాంబు దాడి (Bomb Threat) చేస్తానంటూ ఓ వ్యక్తి లేఖ రాయడం కలకలం రేపింది. బాంబే హైకోర్టులోని (Bombay HC) నాగ్‌పుర్ ధర్మాసనంలోని ఇద్దరు జడ్జిలకు వచ్చిన బెదిరింపు వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభించినట్లు నాగ్‌పుర్ పోలీసులు వెల్లడించారు. ప్రాపర్టీ టాక్స్ పెంచడాన్ని సవాల్ చేస్తూ మహారాష్ట్ర అమరావతిలోని వరూద్ పరిషత్‌కు చెందిన ప్రభాకర్ కాలే అనే వ్యక్తి అక్కడి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ కేసులో అనుకూల తీర్పు ఇవ్వాలని.. లేదంటే ఇద్దరు న్యాయమూర్తులపై బాంబుతో దాడి జరుగుతుందని పేర్కొంటూ నాగ్‌పుర్ బెంచ్‌కు (Nagpur Bench Gets Bomb Threat) పిటిషనర్ పేరుతో ఓ లేఖ వచ్చింది.
అక్టోబర్ 11న ఈ బెదిరింపు లేఖ రావడంతో అప్రమత్తమైన కోర్టు అధికారులు.. దీనిపై వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. సదరు పిటిషనర్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. అయితే, ఆ లేఖకు తనకు ఎటువంటి సంబంధం లేదని అతడు చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రభాకర్ కాలే న్యాయవాది కూడా ఇదే విషయాన్ని పేర్కొన్నారు. పిటిషనర్ ప్రతిష్ఠను దిగజార్చేందుకు ఎవరో ఇటువంటి చర్యలకు పాల్పడి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో మరో కోణంలో దర్యాప్తును ప్రారంభించిన పోలీసులు.. కీలక ఆధారాల కోసం కోర్టు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.