Lucknow, DEC 04: ఇటీవలి కాలంలో ఆకస్మిక గుండెపోటుతో (Cardiac Arrest) మరణిస్తున్న వారి సంఖ్య బాగా పెరిగింది. చిన్న, పెద్ద అనే తేడా లేదు.. యాజ్ తో సంబంధమే లేదు.. సడెన్ గా హార్ట్ ఎటాక్ తో (Cardiac Arrest) హఠాన్మరణం చెందుతున్నారు. మూడు పదుల వయసు కూడా దాటని వారు సైతం గుండెపోటుతో మరణిస్తున్నారు. ఈ పరిణామం ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా ఉత్తరప్రదేశ్ (Uttara Pradesh) రాష్ట్రంలో ఓ పెళ్లిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పెళ్లి మండపం పైనే నవ వధువు గుండెపోటుతో మరణించింది. లక్నో (Lucknow) శివార్లలోని బడ్వానాలో ఈ ఘటన జరిగింది.
బడ్వానా గ్రామానికి చెందిన రాజ్ పాల్ కూతురు శివంగి (20)కి, అదే గ్రామానికి చెందిన వివేక్ తో (Vivek) పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఊరేగింపుగా వధూవరుల కుటుంబాలు మండపానికి చేరుకున్నాయి. అంతా సందడిగా ఉంది. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు మండపంపైకి ఎక్కారు. దండలు మార్చుకుంటున్న సమయంలో వధువు శివంగి (Shivangi) ఒక్కసారిగా మండపంపైనే కుప్పకూలింది. దీంతో బంధువులు కంగారుపడ్డారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు.
కాగా, గుండెపోటుతో ఆమె అప్పటికే చనిపోయిందని డాక్టర్లు చెప్పడంతో నిర్ధాంతపోయారు. దీంతో పెళ్లింట తీవ్ర విషాదం అలుముకుంది. కళ్ల ముందే పెళ్లి కూతురు గుండెపోటుతో చనిపోవడంతో పెళ్లికి వచ్చిన వారంతా షాక్ తిన్నారు. అప్పటివరకు ఎంతో ఆనందంగా ఉన్న ఆ మండపంలో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. వధువు, వరుడి కుటుంబసభ్యులు, బంధువులు కన్నీటిపర్యంతం అయ్యారు.