Lucknow, April 28: మహారాష్ట్రలోని పాల్గరిలో సాధువుల హత్య ఘటన మరువకముందే యుపీలో (Uttar Pradesh) మరో ఇద్దరు సాధువులు హత్యకు గురయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బులంద్‌షహర్‌లోని పగోనా గ్రామంలో శివాయం (Bulandshahr temple) లోపల ఇద్దరు సాధువులను గుర్తు తెలియని దుండగులు పదునైన ఆయుధాలతో అతి కిరాతకంగా (sadhus killed) హతమార్చారు. సోమవారం నాడు ఈ ఘటన జరిగివుండవచ్చని భావిస్తున్నారు. సాధువుల హత్యలో 101 మంది అరెస్ట్, ఒక్క ముస్లిం కూడా లేరు, పాల్గాడ్ ఘటనకు మతం రంగు పూయవద్దు, రాష్ట్ర హోంమంత్రి అనిల్ దినేష్‌ముఖ్ వెల్లడి
మంగళవారం ఉదయం ఆలయానికి వచ్చిన కొందరు గ్రామస్తులు రక్తపు మడుగులో పడి ఉన్న సాధువులను గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన సాధువులను జగన్‌దాస్(55), షేర్ సింగ్(46)గా గుర్తించారు.
కాగా గంజాయి తాగే మురారీ అలియాస్ రాజు అనే వ్యక్తి రెండు రోజుల క్రితం దేవాలయానికి వచ్చి పూజారులతో గొడవపడ్డాడు. పూజారులతో గొడవపడిన మురారీ మద్యం తాగి పెద్ద కత్తి తీసుకువచ్చి వారిద్దరినీ హతమార్చి పారిపోయాడని గ్రామస్థులు చెప్పారు. నిందితుడైన మురారీ అర్దనగ్నంగా గ్రామశివార్లలో పడి ఉండగా పోలీసులు అరెస్టు చేశారు.
దేవాలయంలో ఇద్దరు పూజారుల హత్యా ఘటనపై సమగ్ర నివేదిక పంపించాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు. దీంతో జిల్లా కలెక్టరు, సీనియర్ ఎస్పీలు సంఘటన స్థలానికి వచ్చి దర్యాప్తు చేపట్టారు.
ఈ ఘటనపై బులంద్‌షహర్ ఎస్ఎస్ఎస్పీ సంతోష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. ఇటీవలే ఇద్దరు సాధువులకు ఓ వ్యక్తితో గొడవ జరిగింది. అతను వీరి వస్తువులు దొంగిలించేందుకు ప్రయత్నించే క్రమంలో వారి మధ్య ఘర్షణ జరిగింది. ఆ కోపంతోనే అతను వాళ్లిద్దరినీ చంపేసి ఉండవచ్చని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. ప్రస్తుతం సదరు నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నామని తెలిపారు.
కాగా మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో ఇద్దరు సాధువులతోపాటు ఓ డ్రైవర్‌ను అతి దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే.