New Delhi, September 28: దేశంలో మళ్లీ ఎన్నికల నగారా మోగింది. పార్లమెంటులో ఖాళీగా ఉన్న మూడు లోక్‌సభ స్థానాలకు ( 3 Lok Sabha) అక్టోబర్ 30వ తేదీన ఎన్నికలు (Bypolls 2021 Dates and Schedule) నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. వీటితోపాటు దేశవ్యాప్తంగా పలురాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 30 అసెంబ్లీ స్థానాలకు (30 Assembly Seats) కూడా ఉపఎన్నికలు నిర్వహిస్తామని తెలిపింది. ఈ మేరకు మంగళవారం నాడు ఎన్నికల కమిషన్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ఎన్నికల లెక్కింపు నవంబరు 2న జరగనుంది.
కరోనా మహమ్మారి సహా పండుగలు, వరదలు, చలి వంటి అన్ని అంశాలనూ ఎలక్షన్ కమిషన్ పరిశీలించిందని ప్రకటనలో తెలిపింది. ఈ విషయాల్లో ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి కూడా అభిప్రాయాలు సేకరించినట్లు చెప్పింది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే దాద్రా నగర్ హవేలి, డామన్ అండ్ డయ్యూ, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోని మూడు లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు ఈసీ స్పష్టంచేసింది. వీటితోపాటు వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 30 అసెంబ్లీ స్థానాలకు కూడా ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొంది.
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. భబానిపుర్ నియోజకవర్గం నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ ఉప ఎన్నికలను రద్దు చేయాలని వేసిన పిటిషన్‌ను కోల్‌కతా హైకోర్టు కొట్టివేసింది. ఉప ఎన్నికలను రద్దు చేయబోమని కోర్టు స్పష్టం చేసింది. గురువారమే ఆ ఎన్నికను నిర్వహించనున్నట్లు కోర్టు చెప్పింది. భబానిపుర్ నుంచి 2011, 2016లో దీదీ ప్రాతినిధ్యం వహించారు. బీజేపీ అభ్యర్థి ప్రియాంకా తిబ్రేవాల్‌తో మమతా పోటీపడుతున్నారు. 41 ఏళ్ల తిబ్రేవాల్ కోల్‌కతా హైకోర్టులో లాయర్‌గా చేస్తున్నారు. మూడవసారి సీఎం అయిన మమతా బెనర్జీ.. నందీగ్రామ్‌లో ఓడిపోవడం వల్ల.. భబానీపుర్ ఉప ఎన్నికలో కచ్చితంగా ఎమ్మెల్యేగా గెలవాల్సి ఉంటుంది. అక్టోబర్ 3న ఫలితాలు వెలుబడుతాయి.