New Delhi, September 16: టెలికాం రంగానికి కేంద్రం ఊరటనిచ్చింది. టెలికాం కంపెనీలు ప్రభుత్వానికి చేయాల్సిన చెల్లింపులపై మారటోరియం ప్రకటించింది. ఈ మేరకు ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం నిర్ణయం తీసుకుంది. టెలికమ్యూనికేషన్ల రంగంలో తలపెట్టిన అనేక నిర్మాణపరమైన భారీ సంస్కరణలకు కేంద్రమంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ సంస్కరణలు టెలికాం రంగాన్ని పరిరక్షించడంతోపాటు, మరిన్ని ఉద్యోగ అవకాశాలను కల్పిస్తాయని, ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహిస్తాయని, వినియోగదారుల ప్రయోజనాలను కాపాడతాయని ప్రభుత్వం భావించింది. అంతేకాకుండా నగదు అందుబాటు అవకాశాలను మెరుగుపరుస్తాయని, పెట్టుబడులను ప్రోత్సహించి, టెలికాం సర్వీస్ ప్రొవైడర్లపై నియంత్రణా పరమైన భారాన్ని తగ్గిస్తాయని అంచనా.
కోవిడ్-19 వైరస్ మహమ్మారి విసిరిన సవాళ్లను ఎదుర్కొనడంలో టెలికాం రంగం చక్కని సామర్థ్యాన్ని, పనితీరును చూపిన నేపథ్యంలో, ఈ సంస్కరణా ప్యాకేజీ వలన బ్రాడ్ బ్యాండ్ సదుపాయం, టెలికాం అనుసంధానం వంటివి మరింత వేగవంతంగా విస్తృతం కాగలవని భావిస్తున్నారు. డేటా వినియోగంపై భారీగా ఒత్తిడి పెరగడం ఆన్ లైన్ విద్య, వర్క్ ఫ్రమ్ హోమ్, సామాజిక మాధ్యమాల ద్వారా వ్యక్తుల మధ్య కనెక్టివిటీ పెరగడం వంటి పరిణామాల నేపథ్యంలో ఈ తాజా సంస్కరణలు టెలికం రంగానికి మరింత ఊపునిస్తాయని ఆశిస్తున్నారు.
ఇక, కేంద్రమంత్రివర్గం తీసుకున్న నిర్ణయంతో టెలికాం రంగం మరింత బలోపేతం కానుంది. టెలికాం సంస్థల మధ్య పోటీతత్వం పెంచడం, వినియోగదారులు తమకు ఇష్టమైన సర్వీస్ ప్రొవైడరును ఎంపిక చేసుకునే సదుపాయంతో పాటు ఇప్పటివరకూ బ్రాడ్ బాండ్ సదుపాయంలేని చోట్లకు ఇంటర్నెట్ అనుసంధానంతో సార్వత్రిక బ్రాడ్ బాండ్ అనుసంధానం కల్పించడం తాజా సంస్కరణల ప్యాకేజీ ధ్యేయంగా పెట్టుకున్నారు. 4జీ విస్తరణ, నగదు అందుబాటులో ఉంచే అవకాశాలు పెంచడం, 5జీ నెట్వర్క్.లో పెట్టుబడుల ప్రోత్సాహానికి తగిన వాతావరణాన్ని కల్పించడం కూడా తాజా సంస్కరణల లక్ష్యం.
కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో భారీ అప్పులు, బకాయిలతో కూరుకుపోయిన వోడాఫోన్- ఐడియా లాంటి టెలికం కంపెనీలకు భారీ ఉపశమనం లభించినట్లయింది. ఆయా సంస్థలు ఇప్పటివరకు చెల్లించని బకాయిలపై తాత్కాలిక నిషేధం, సవరించిన గ్రాస్ రెవెన్యూ (AGR) మొత్తాన్ని కుదించడం మరియు స్పెక్ట్రం వినియోగ ఛార్జీలలో రాయితీలు లభించనున్నాయి. అయితే మారటోరియంను ఉపయోగించుకునే టెలికాం సంస్థలు ముందుగా కొంత వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. బకాయిల వాయిదా కారణంగా తలెత్తిన వడ్డీని టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు ఈక్విటీ మార్గంలో చెల్లించేందుకు వెసులుబాటు ఉంటుంది. వచ్చే నెల అక్టోబర్ 1 మారటోరియం అమలులోకి వస్తుంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శక సూత్రాలను రాబోయే రోజుల్లో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఖరారు చేస్తుంది.