Chennai, SEP 07: తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) సనాతన ధర్మం నిర్మూలించాలంటూ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మంత్రి వ్యాఖ్యలపై హిందూ సంఘాలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. అటు బీజేపీ నేతలు సైతం ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. ఇప్పటికే ఈ వివాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం ఘాటుగా స్పందించారు. డీఎంకే మంత్రి సనాతన ధర్మం వ్యాఖ్యలపై సరైన విధంగా స్పందిస్తూ ధీటుగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో బీజేపీ ఐటీ విభాగం అధిపతి అమిత్ మాల్వియాపై కేసు నమోదైంది. డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌పై చేసిన ట్వీట్ నేపథ్యంలో ఆయనపై తాజాగా కేసు నమోదు అయ్యింది.
కాగా అమిత్ మాల్వియా (Amit Malviya)ట్విటర్‌లో..‘తమిళనాడు సీఎం కొడుకు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) సనాతన ధర్మాన్ని మలేరియా, డెంగ్యూతో పోలుస్తూ వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్న భారతదేశంలోని 80% జనాభాను ఉచకోత కోయాలని ఆయన(ఉదయనిధి) అనుకుంటున్నారు. తన అభిప్రాయాన్ని వ్యతిరేకించడమే కాదు నిర్మూలించాల్సిందే. డీఎంకే ప్రతిపక్ష ఇండియా కూటమిలో ప్రముఖ పార్టీ. కాంగ్రెస్‌కు దీర్ఘకాల మిత్రపక్షం. ముంబై సమావేశంలో ఇదేనా మీరు అంగీకరించింది? అని ప్రశ్నించారు.
Udhayanidhi Stalin, son of Tamilnadu CM MK Stalin, and a minister in the DMK Govt, has linked Sanatana Dharma to malaria and dengue… He is of the opinion that it must be eradicated and not merely opposed. In short, he is calling for genocide of 80% population of Bharat, who… pic.twitter.com/4G8TmdheFo
— Amit Malviya (@amitmalviya) September 2, 2023
అమిత్ మాల్వియా ట్వీట్‌పై (Amit Malviya Tweet) ఇక డీఎంకే కార్యకర్త కేఏవీ దినకరన్ ఫిర్యాదు చేయగా.. తమిళనాడులోని తిరుచ్చిలో మాల్వియాపై ఎఫ్‌ఐఆర్ దాఖలైంది. సనాతన ధర్మంపై చేసిన తన వాఖ్యలకు ఉదయనిధి స్టాలిన్ వివరణ ఇచ్చినప్పటికీ రాజకీయ ఉద్దేశ్యంతో రెండు వర్గాల మధ్య హింస, ద్వేషాన్ని రెచ్చగొట్టడానికి, మత సామరస్యాన్ని దెబ్బతీసేలా మంత్రి (ఉదయనిధి) వ్యాఖ్యలను అమిత్ మాల్వియా ఉద్దేశపూర్వకంగా వక్రీకరించారు’ అని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అటు మాల్వియా ట్వీట్ తర్వాత, సనాతన ధర్మాన్ని అనుసరించే వారిపై హింసకు తాను పిలుపు ఇవ్వలేదని ఉదయనిధి స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలపై కట్టుబడి ఉన్నానని, సనాతన ధర్మం వల్ల నష్టపోతున్న అట్టడుగు వర్గాల తరపున తాను మాట్లాడానని మంత్రి వివరణ ఇచ్చారు.
కాగా సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులతో పోల్చిన ఉదయనిధి స్టాలిన్.. సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడమే కాకుండా నిర్మూలించాలని అన్నారు. దీంతో సనాతన ధర్మాన్ని, హిందూ సంప్రదాయాన్ని కించపరిచేలా చేసిన తన వ్యాఖల్యను ఉదయనిధి వెనక్కి తీసుకొని.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.