New Jammu and Kashmir and Ladakh Map | New Political Map of India | (Photo Credits: Govt of India)

New Delhi, November 21: కొత్తగా సృష్టించిన కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూ కాశ్మీర్ మరియు లద్దాఖ్ ( J&K and Ladakh) భూభాగాలను చూపేటువంటి సరికొత్త భారతదేశ రాజకీయ పటాన్ని (latest political map of India) మాత్రమే ఉపయోగించాలని కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ( I&B ministry ) అన్ని ప్రైవేట్ శాటిలైట్ టెలివిజన్ ఛానెళ్లకు అడ్వైజరీ జారీ చేసింది. ఈ మేరకు 'సర్వే ఆఫ్ ఇండియా' (Survey of India) ఆమోదించిన నూతన చిత్రపటాన్ని ఇక మీదట చూపించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

గత నెల అక్టోబర్ 31న భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ మరియు లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు అధికారికంగా అవతరణలోకి వచ్చాయి. అందుకనుగుణంగా నవంబర్ 02న కొత్త రాజకీయ చిత్ర పటం ఖరారైందని కేంద్ర ఐటీ శాఖ తెలిపింది. నవంబర్ 18న ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను కేంద్ర ప్రభుత్వం వెలువరించింది. ఈరోజు నవంబర్ 21, గురువారం రోజున ఆ ఉత్తర్వులను ఐటీ శాఖ ప్రజలకు బహిరంగ పరిచింది.

కేంద్ర ప్రభుత్వం నూతనంగా విడుదల చేసిన భారత దేశ రాజకీయ చిత్ర పటం

సర్వే ఆఫ్ ఇండియా, సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం తయారు చేసిన ఈ సరికొత్త రాజకీయ చిత్రపటంలో ఇప్పుడు సర్వే ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ లో ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు. ఇదే మ్యాప్ ఉపయోగించాలని మీడియా- టీవీ ఛానెల్స్ ను కేంద్ర ప్రభుత్వం కోరింది.

ఈ నూతన చిత్ర పటంలో లద్దాఖ్ యూటీ కార్గిల్ మరియు లేహ్ రెండు జిల్లాలను కలిగి ఉంది. ఇక మిగతా భాగం జమ్మూ కాశ్మీర్ యొక్క పూర్వ రాష్ట్రం లాగే ఉంచబడింది.

 

తొమ్మిది కేంద్రపాలిత ప్రాంతాలు:

  1. అండమాన్ మరియు నికోబార్
  2. చండీగఢ్
  3. డామన్ మరియు డయూ
  4. దాదర్ మరియు నగర్ హవేలి
  5. ఢిల్లీ
  6. జమ్మూ కాశ్మీర్
  7. లడఖ్
  8. లక్షద్వీప్
  9. పుదుచ్చేరి

జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే ఆర్టికల్ 370 లోని నిబంధనలను ఆగస్టు 4న కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. తద్వారా జమ్ముకాశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది.