New Delhi Feb 03: కరోనా మహమ్మారి కారణంగా మూతపడ్డ స్కూళ్లను (Schools Closed) పూర్తిస్థాయిలో తెరిచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. చాలా రాష్ట్రాల్లో గత రెండేళ్లుగా విద్యా సంస్థలు (Schools) తెరుచుకోకపోవడంతో పిల్లల చదువులు పాడయ్యాయి. ఒమిక్రాన్‌తో అంత తీవ్రత ఏమీ లేకపోవడం, దేశంలో వ్యాక్సినేషన్ (Vaccination) భారీగా కొనసాగుతుండటంతో ఇప్పుడిప్పుడే స్కూళ్లు పూర్తిస్థాయిలో తెరుచుకొంటున్నాయి. అయితే, ఇంకా కొందరు తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లల్ని బడులకు పంపేందుకు జంకుతున్నారు. ఈ పరిస్థితుల్లో పాఠశాలల పునఃప్రారంభంపై పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకొని కేంద్ర విద్యాశాఖ సవరించిన కొత్త మార్గదర్శకాలు (Guidelines) విడుదల చేసింది.
.@EduMinOfIndia has prepared the guidelines/SOP for the reopening of schools
👉Proper cleaning & sanitation facilities
👉Flexible, staggered & reduced timings for different classes
👉Students willing to study from home with the consent of the parents may be allowed to do so pic.twitter.com/HqXUbXvv6s
— PIB India (@PIB_India) February 3, 2022
కేంద్ర విద్యాశాఖ జారీ చేసిన మార్గదర్శకాలు:
స్కూళ్లలో పరిశుభ్ర వాతావరణం ఉండాలి. పరిసరాల్ని ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాలి.
పిల్లల మధ్య 6 అడుగులు దూరం ఉండేలా సీటింగ్ ఏర్పాటు చేయాలి.
సిబ్బంది గదుల్లో, ఆఫీస్ ఏరియా, అసెంబ్లీ హాలు, ఇతర ప్రాంతాల్లోనూ భౌతికదూరం పాటించేలా చూడాలి.
భౌతికదూరం పాటించడం సాధ్యం కాకపోతే స్కూల్ ఈవెంట్లు నిర్వహించరాదు.
విద్యార్థులు, సిబ్బంది అంతా మాస్కులు ధరించాలి. మధ్యాహ్న భోజనం అందించేటప్పుడు భౌతికదూరం పాటించేలా జాగ్రత్త పడాలి.
పాఠశాల బస్సులు/వ్యాన్‌లను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాలి.
స్కూల్ బస్సులు/వ్యాన్‌ల డ్రైవర్లు, కండెక్టర్లు ఎప్పుడూ భౌతికదూరం పాటించాలి. విద్యార్థులు బస్సులు/క్యాబ్‌లలో విద్యార్థులు దూరంగా ఉండేలా చూడాలి.
హాస్టళ్లలో అయితే, అన్నివేళలా భౌతికదూరం పాటించడంతో పాటు, పిల్లల బెడ్‌ల మధ్య దూరం ఉండేలా చర్యలు తీసుకోవాలి.
పిల్లలను స్కూళ్లకు పంపేందుకు వారి తల్లిదండ్రుల సమ్మతిని తీసుకొనేలా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు చర్యలు చేపట్టాలి. ఒకవేళ వారు ఆన్‌లైన్ తరగతులవైపే మొగ్గుచూపితే అందుకు అనుమతించాలి.
కొవిడ్ నుంచి ఎలా సురక్షితంగా ఉండాలో మాక్ సేఫ్టీ డ్రిల్స్ నిర్వహించి శానిటైజేషన్‌పై అవగాహన కల్పించాలి.
ఇల్లులేని, వలస కూలీల పిల్లలు, ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులు, కొవిడ్ సోకిన పిల్లలపై ప్రత్యేక దృష్టిసారించాలి. వారి అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలి.
విద్యార్థులు, ఉపాధ్యాయులు మానసిక ఆరోగ్యంపైనా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
మరోవైపు, దేశంలో ఇప్పటివరకు 11 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో మాత్రమే పాఠశాలలు పూర్తిస్థాయిలో తెరుచుకున్నట్టు కేంద్ర విద్యాశాఖ సంయుక్త కార్యదర్శి వెల్లడించారు. మరో 16 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో పాక్షికంగా తెరుచుకోగా.. మరో 9 రాష్ట్రాల్లో అయితే ఇంకా పాఠశాలలు పునఃప్రారంభం కాలేదని చెప్పారు.
స్కూళ్లు పూర్తిగా తెరుచుకున్న 11 రాష్ట్రాలివే: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అరుణాచల్‌ప్రదేశ్, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, సిక్కిం, కర్ణాటక, త్రిపుర, తమిళనాడు, గోవా, మణిపూర్
పాక్షికంగా రీ-ఓపెన్ చేసిన రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు: అసోం, ఛత్తీసగఢ్, చండీగఢ్, హరియాణా, హిమాచల్‌ప్రదేశ్, మిజోరం, రాజస్థాన్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, మేఘాలయ, కేరళ, నాగాలాండ్, గుజరాత్, డామన్ డయ్యూ, అండమాన్ నికోబార్ దీవులు, పశ్చిమబెంగాల్
ఇంకా స్కూళ్లు తెరవని రాష్ట్రాలు: బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్, పుదుచ్ఛేరి, ఝార్ఖండ్, లద్దాఖ్, జమ్మూకశ్మీర్, ఒడిశా, ఢిల్లీ