Chandipura Virus in Gujarat PTI Photo (Representational Image)

Gandhi Nagar, July 16: జూలై 10 నుండి గుజరాత్‌లో అనుమానాస్పద చాందిపురా వైరస్‌ (Chandipura Virus) కారణంగా ఆరుగురు పిల్లలు మరణించారని, మొత్తం కేసుల సంఖ్య 12కి పెరిగిందని రాష్ట్ర ఆరోగ్య మంత్రి రుషికేష్ పటేల్ తెలిపారు. పూర్తి స్థాయి నిర్ధారణ కోసం 12 మంది రోగుల నమూనాలను పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవి)కి పంపినట్లు ఆయన సోమవారం తెలిపారు.నమూనాల ఫలితాల అనంతరం ఆ మరణాలు చాందిపురా వైరస్‌ వల్ల సంభవించాయో లేదో స్పష్టంగా తెలుస్తుందన్నారు.

వైరస్‌ సోకిన 12 మంది రోగుల్లో నలుగురు సంబర్‌కాంత్‌ జిల్లాకు చెందిన వారని మంత్రి తెలిపారు. ముగ్గురు ఆరావళి, మహిసాగర్‌, ఖేడా జిల్లాలకు చెందిన ఒక్కొక్కరు ఉన్నట్లు పేర్కొన్నారు. మరో ముగ్గురు మధ్యప్రదేశ్ (ఒకరు)‌, రాజస్థాన్‌ (ఇద్దరు)కు చెందిన వారని చెప్పారు. ప్రస్తుతం వారంతా గుజరాత్‌లో చికిత్స పొందుతున్నారన్నారు. ఈ 7 కారకాలు క్యాన్సర్ లక్షణాలను పెంచుతాయి.. జీవనశైలిలో మార్పులు క్యాన్సర్ ప్రమాదాన్నినివారించవచ్చు..

ఈ ఆరింటిలో ఐదు మరణాలు సబర్‌కాంతా జిల్లాలోని హిమత్‌నగర్‌లోని సివిల్‌ ఆసుపత్రిలో నమోదైనట్లు మంత్రి తెలిపారు. చాందిపురా వైరస్‌ అంటు వ్యాధి కాదని మంత్రి పేర్కొన్నారు. అయితే, ప్రభావిత ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో నిఘా పెట్టినట్లు చెప్పారు. సుమారు 4,487 ఇళ్లలో 18,646 మంది వ్యక్తులను పరీక్షించినట్లు తెలిపారు. వ్యాధి వ్యాప్తి చెందకుండా నిరోధక చర్యలు చేపట్టామని.. ఆరోగ్య శాఖ 24 గంటలు పని చేస్తోందని మంత్రి వివరించారు.

మహారాష్ట్రలోని చాందిపురా గ్రామంలో తొలిసారి ఈ వైరస్‌ను గుర్తించారు. ఇది పిల్లలకు వ్యాపిస్తుంది. వైరస్‌ సోకిన వారికి ఫ్లూ వంటి లక్షణాలతో జ్వరం వస్తుంది. తీవ్రమైన మెదడు వాపు కూడా కనిపిస్తుంది. దోమలు, ఈగలు, పేలు వంటివాటి ద్వారా ఇది వ్యాపిస్తుంది. ఇది వ్యాధికారక రాబ్డోవిరిడే కుటుంబానికి చెందిన వెసిక్యులోవైరస్ జాతికి చెందినది. బాధితులకు చికిత్స అందించడంలో ఆలస్యమైతే ప్రాణాంతకం కావచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు.  ఈ చెడు అలవాట్ల వల్ల బెల్లీ ఫ్యాట్ పెరుగుతుంది.. మీరు కూడా ఈ తప్పులు చేస్తున్నారా... అయితే జాగ్రత్త

చాందిపురా వైరస్‌ ఇప్పుడు గుజరాత్‌ను దాటి రాజస్థాన్‌లోకి ప్రవేశించింది. రాజస్థాన్‌లోని ఉదయపూర్ జిల్లాలో చాందిపురా వైరస్‌ కేసులు నమోదైన దరిమిలా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.వైద్యాధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఖేర్వాడా బ్లాక్‌లోని నల్ఫాలా, అఖివాడ గ్రామాలకు చెందిన ఇద్దరు చిన్నారులు ఈ వైరస్‌ బారినపడి హిమ్మత్‌నగర్‌లో చికిత్స పొందుతున్నారు.

ఈ రెండు గ్రామాలు గుజరాత్ సరిహద్దుల్లో ఉన్నాయి. ఈ ప్రాంతానికి చెందినవారు ఉపాధి కోసం గుజరాత్ సరిహద్దు ప్రాంతాలకు వలస వెళుతుంటారు. ఈ వైరస్‌ బారినపడిన చిన్నారులలో ఒకరు మృతి చెందారని తాజా సమాచారం.మీడియాకు అందిన వివరాల ప్రకారం గుజరాత్ మెడికల్ అడ్మినిస్ట్రేషన్ ఈ వైరస్‌ నమూనాలను పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ)కి పంపింది.