Dehradun, September 17: చార్‌ధామ్ యాత్ర నేడు ప్రారంభం కానుంది. కరోనా వల్ల వాయిదాపడుతూ వస్తున్న యాత్రకు (Char Dham Yatra 2021) నైనిటాల్ హైకోర్టు అనుమతించింది. అయితే వ్యాక్సిన్ తీసుకున్న, కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ ఉన్నవారిని మాత్రమే యాత్రకు అనుమతించాలని షరతు విధించింది. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం కరోనా మార్గదర్శకాలు (COVID-19 Norms) జారీ చేసింది. హిమాలయల్లో ఉన్న గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయాలకు వచ్చే యాత్రికులు తప్పనిసరిగా కరోనా నియమాలను పాటించాలని స్పష్టం చేసింది.
వ్యాక్సిన్తీసుకున్నట్లు సర్టిఫికెట్‌ను సమర్పించాలని, టీకా తీసుకోని వారు ఆర్టీపీసీఆర్ నెగటివ్ రిపోర్టును చూపించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. కరోనా తీవ్ర స్థాయిలో ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చే యాత్రికులకు టీకాను తప్పనిసరి చేసింది. యాత్ర (Char Dham Yatra) సాగినన్ని రోజులు.. బద్రీనాథ్‌కు రోజుకు వెయ్యి మంది చొప్పున, కేదార్‌నాథ్‌కు 8 వందల మంది, గంగోత్రి 600, యమునోత్రికి 400 మందికి మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది.
ఇక కరోనా థర్డ్ వేవ్ ఆందోళన నేపధ్యంలో కొవిడ్-19 నిబంధనలను ఒడిషా ప్రభుత్వం కఠినతరం చేసింది. నేటి నుంచి ప్రతి వారంలో శనివారం మాత్రమే పూరి జగన్నాధ్ ఆలయంలోకి భక్తులను అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మహమ్మారి తీవ్రతతో నాలుగు నెలల విరామం అనంతరం పూరి జగన్నాధ్ ఆలయం ఆగస్ట్ 23న భక్తుల కోసం తిరిగి తెరిచారు. అప్పటినుంచి వారానికి ఐదు రోజులు ఆలయంలోకి భక్తులను అనుమతించారు.
ఇక ఆలయం సందర్శించే భక్తులు విధిగా కొవిడ్-19 టీకా రెండు డోసులు తీసుకున్న సర్టిఫికెట్ లేదా కొవిడ్-19 నెగెటివ్ రిపోర్టును సమర్పించాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. భక్తులు తమ ఆధార్, ఓటర్ ఐడీ వంటి పోటో గుర్తింపు కార్డు చూపుతూ సింహద్వారం నుంచి లోపలికి రావాల్సి ఉంటుందని, దర్శనానంతరం ఉత్తరద్వారాం నుంచి వెలుపలికి పంపుతారని అధికారులు తెలిపారు.