ఎన్నికల వేళ ఛత్తీస్‌గఢ్లో మరోసారి తుపాకుల మోత మోగింది.బీజాపూర్ జిల్లాలోని కొర్చోలి అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో (Chhattisgarh Encounter) నలుగురు నక్సలైట్లు మృతి చెందారు. పెద్ద సంఖ్యలో నక్సల్స్ గాయపడినట్లు సమాచారం.ఘటన జరిగినప్పటికీ పోలీసులు ఇంకా అడవిలోనే ఉండి మావోల కదలికలను పరిశీలిస్తున్నారు. సోదాలు నిర్వహిస్తూ ఆధారాల కోసం అన్వేషిస్తున్నారు. ఘటన జరిగిన ప్రాంతంలో ఏకే 47 తుపాకీ లభ్యమైంది.
డీఆర్జీ, సీఆర్పీఎఫ్ కు చెందిన కోబ్రా బెటాలియన్, బస్తర్ ఫైటర్స్, బస్తారియా బెటాలియన్, సీఏఎఫ్ సిబ్బంది మావో వ్యతిరేక ఆపరేషన్ కోసం అడవికి వెళ్లాయి. గంగులూరు ఏరియా కమిటీ నక్సలైట్లు వీరిపై కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎదురు కాల్పులకు దిగారు. ఇరువైపులా కాల్పులు జరపడంతో నలుగురు మావోయిస్టులు (Four Naxalites Killed in Gunfight ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన నక్సల్స్ మృత దేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలం నుంచి ఇన్సాస్, ఎల్ ఎంజీ వంటి ఆటోమేటిక్ ఆయుధాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డీఆర్జీ, సీఆర్పీఎఫ్, కోబ్రా, బస్తర్ ఫైటర్స్ బలగాలు ఇంకా ఎదురు కాల్పుల్లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లో జవాన్లపై ఐఈడీతో నక్సలైట్లు దాడి, ఐటీబీపీ జవాన్ మృతి, పోలింగ్ అనంతరం తిరిగి వస్తుండగా ఘటన
వారం రోజుల క్రితం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఛత్తీస్‌గఢ్‌లో బీజాపూర్‌తో సహా ఏడు జిల్లాలున్న బస్తర్ ప్రాంతంలో మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఈ ఏడాది భద్రతా బలగాలు, పోలీసుల..చేపట్టిన మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్‌లో జరిగిన ఎన్‌కౌంటర్లలో ఇప్పటి వరకు 34 మంది నక్సలైట్లు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇక.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడ మొదటి దశలో ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది. దీంతో ఈ ప్రాంతాన్ని భద్రతా బలగాలు మరింత జల్లెడ పడుతున్నారు.