New Delhi, April 26: ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh)లోని బస్తర్ జిల్లాలో మావోయిస్టులు (Maoists) ఘాతుకానికి పాల్పడ్డారు. దంతేవాడలో పోలీసుల వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని మందుపాతరతో పేలుడు జరిపారు. ఈ ఘటనలో 10 మంది పోలీసులు, డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు. దీనికి సంబంధించిన దృశ్యాలు భీతావహంగా ఉన్నాయి. దాడిలో ఆర్మీ జవాన్లు ప్రయాణిస్తున్న మినీ బస్సు ముక్కలు ముక్కలు అయింది. రోడ్డు మొత్తం గుంతల మయం అయింది.
దంతేవాడ అడవుల్లో మావోయిస్టులు నక్కినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో ఈ ఉదయం డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్ (డీఆర్‌జీ) ప్రత్యేక యాంటీ-నక్సలైట్ ఆపరేషన్ చేపట్టారు. ఆ ఆపరేషన్ ముగించుకుని మినీ వ్యాన్‌లో తిరిగివస్తుండగా మావోయిస్టులు ఐఈడీతో దాడి చేసి వ్యాన్‌ను పేల్చేశారు. ఈ ఘటనలో 10 మంది పోలీసులు, వ్యాన్ డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందారు. మరికొందరు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
ఛత్తీస్‌గఢ్‌లో ప్రధాన నక్సల్స్ దాడుల కాలక్రమం క్రింది విధంగా ఉంది.
ఏప్రిల్ 2023: బస్తర్ జిల్లాలో మావోయిస్టులు మందుపాతరలో 10 మంది జవాన్లతో సహా, డ్రైవర్ మృతి
ఏప్రిల్ 2021: బీజాపూర్, సుక్మా జిల్లాల సరిహద్దుల్లోని టెర్రామ్ జంగిల్స్‌లో నక్సల్స్‌తో జరిగిన కాల్పుల్లో 22 మంది భద్రతా సిబ్బంది మరణించారు.
మార్చి 2018: సుక్మా జిల్లాలో మావోయిస్టులు ప్రేరేపించిన IED పేలుడులో తొమ్మిది మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) సిబ్బంది మరణించారు.
ఫిబ్రవరి 18, 2018: సుక్మాలోని భెజ్జీలో నక్సల్స్‌తో జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఛత్తీస్‌గఢ్ పోలీసులు మరణించారు.
ఏప్రిల్ 24, 2017: సుక్మాలో మావోయిస్టులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 24 మంది CRPF జవాన్లు మృతి చెందారు.
మార్చి 12, 2017: సుక్మాలో మావోయిస్టుల దాడిలో 12 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారు.
మార్చి 11, 2014: సుక్మా జిల్లాలో మావోయిస్టుల దాడిలో 15 మంది భద్రతా సిబ్బంది మృతి.
ఫిబ్రవరి 28, 2014: దంతెవాడ జిల్లాలో మావోయిస్టుల దాడిలో ఆరుగురు పోలీసు అధికారులు మరణించారు.
మే 25, 2013: దర్భా లోయలో మావోయిస్టుల దాడిలో రాష్ట్ర మాజీ మంత్రి మహేంద్ర కర్మ సహా కాంగ్రెస్ పార్టీకి చెందిన 25 మంది నాయకులు మరణించారు.
జూన్ 29, 2010: నారాయణపూర్ జిల్లాలో మావోయిస్టుల దాడిలో 26 మంది CRPF జవాన్లు మరణించారు.
మే 8, 2010: బీజాపూర్ జిల్లాలో నక్సల్స్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని పేలుడు చేయడంతో ఎనిమిది మంది CRPF జవాన్లు మరణించారు.
ఏప్రిల్ 6, 2010: దంతేవాడ జిల్లాలో మావోయిస్టులు మెరుపుదాడిలో 75 మంది CRPF జవాన్లను హతమార్చారు.
సెప్టెంబర్ 4, 2009: బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు నలుగురు గ్రామస్థులను హతమార్చారు.
జూలై 27, 2009: దంతేవాడ జిల్లాలో నక్సల్స్ మందుపాతర పేల్చడంతో ఆరుగురు వ్యక్తులు మరణించారు.
జూలై 18, 2009: బస్తర్ జిల్లాలో నక్సల్స్ చేతిలో ఓ గ్రామస్థుడు హతమయ్యాడు.