New Delhi, Nov 26: పార్లమెంటు సెంట్రల్ హాల్లో శుక్రవారం రాజ్యాంగ దినోత్సవం (Constitution Day 2021) ఘనంగా జరుగింది. ఈ వేడుకల్లో ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు పలువురు కేంద్రమంత్రులు, ఇతర ప్రముఖులు, ఎంపీలు కూడా పాల్గొన్నారు. ఈ వేడుకలకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నాయకత్వం వహించారు. వేడుకలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విశిష్ట సభలను ఉద్దేశించి (PM Narendra Modi Addresses Parliament) ప్రసంగించారు.
ప్రధాని మోదీ మాట్లాడుతూ.. విభిన్నమైన మన దేశాన్ని.. మన రాజ్యాంగం ఏకీకృతం చేస్తుందని అన్నారు. ఎన్నో అవరోధాల తర్వాత రాజ్యాంగాన్ని రచించినట్లు ఆయన తెలిపారు. స్వతంత్య్రంగా ఉన్న రాష్ట్రాలను మన రాజ్యాంగం ఏకంగా (Our Constitution Binds Our Diverse Country) చేసిందని ప్రధాని మోదీ అన్నారు.రాజ్యాంగ దినోత్సవం రోజున మన పార్లమెంట్‌కు సెల్యూట్ చేయాలన్నారు. ఇక్కడే అనేక మంది నేతలు తమ మేథోమథనంతో రాజ్యాంగాన్ని రచించినట్లు చెప్పారు. మహాత్మా గాంధీతో పాటు దేశ స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన ఎంతో మంది నేతలకు నివాళి అర్పిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు.
ముంబైలో ఉగ్రదాడులు జరిగి నేటికి 14 ఏళ్లు అవుతోందని, ఉగ్రవాదులతో పోరాడుతూ ప్రాణాలు అర్పించిన సాహస సైనికులకు నివాళ్లు అర్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. 1950 తర్వాత ప్రతి ఏడాది రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించాల్సి ఉందని, రాజ్యాంగ నిర్మాణంపై ప్రజలను చైతన్యపరచాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. కానీ కొందరు అలా వ్యవహరించలేదన్నారు. మన హక్కుల రక్షణ కోసం మన విధులు ఏంటో తెలుసుకోవాలన్నారు.
ఈ సందర్భంగా స్పీకర్ ఓం బిర్లా మాట్లాడారు. భారత రాజ్యాంగం ఆధునిక భగవత్ గీత అన్నారు. దేశం పట్ల మన కర్తవ్యాన్ని నిర్వర్తించేందుకు రాజ్యాంగం మనల్ని ప్రేరేపిస్తుందన్నారు. ప్రతి ఒక్కరం దేశం కోసం పనిచేయాలని తపిస్తే, అప్పుడు మనం ఏక్ భారత్, శ్రేష్ట భారత్‌ను నిర్మించవచ్చు అని స్పీకర్ బిర్లా తెలిపారు.