New Delhi, Dec 18: దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో (Coronavirus Cases Rise in India) కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు (Govt advisory amid Covid spike) చేసింది. కోవిడ్ టెస్టులకు సిద్ధంగా ఉండాలని తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్టీపీసీఆర్ టెస్ట్ కిట్‌లను సిద్దంగా ఉంచాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. అలాగే, పాజిటివ్ శాంపిల్స్‌ను జినోమ్ సీక్వెన్సింగ్‌కు పంపాలని కోరింది.
ఇక, జెన్-1 వేరియంట్ కేసులు (new JN.1 variant) పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ అలర్ట్ జారీ చేసింది. జిల్లాల వారీగా ఇన్‌ఫ్లుఎంజా వంటి అనారోగ్యాలు, శ్వాసకోస సంబంధ వ్యాధుల నమోదును పర్యవేక్షించడంతోపాటు వాటి గురించి రిపోర్ట్ ఇవ్వాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది.కరోనా పరిస్థితిపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కోరింది.
మరోవైపు రాబోయే పండుగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రజారోగ్యంపై దృష్టిసారించాలని రాష్ట్రాలను కేంద్రం కోరింది. పరిశుభ్రత విధానాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, వ్యాధుల వ్యాప్తి పెరిగే ప్రమాదాన్ని నివారించేందుకు అవసరమైన ప్రజారోగ్య చర్యలు, అవగాహన కార్యక్రమాలు వంటివి చేపట్టాలని రాష్ట్రాలకు సూచించింది.
భారత్ సహా 38 దేశాల్లో ఈ కొత్త వేరియంట్ గుర్తించినట్లు వెల్లడించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన సూచనల మేరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలను హెచ్చరించింది. అప్రమత్తంగా ఉంటూ, కొత్త కేసులపై నిఘా ఉంచాలని ఆదేశించింది.ఇప్పటికే కేరళలో కొత్త వేరియంట్ బయటపడింది. ఈ వేరియంట్ కారణంగా ఐదుగురు మృతిచెందారు. మృతుల్లో నలుగురు కేరళవాసులే ఉన్నారు.
కేరళలో కరోనా కొత్త వేరియంట్ కలకలం, మాస్కులు తప్పనిసరిగా ధరించాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు
ఆర్‌టీపీసీఆర్ టెస్టులు ఎక్కువ సంఖ్యలో చేయాలని, వేరియంట్ తెలుసుకునేందుకు జీనోమ్ సీక్వెన్స్ టెస్టులు నిర్వహించాలని సూచించింది. వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్ల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని తాజా అడ్వైజరీలో కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో సంసిద్ధతలను పరీక్షించేందుకు కేంద్ర ఆరోగ్యశాఖ చేపడుతోన్న మాక్ డ్రిల్స్‌లో భాగస్వామ్యం కావాలని సూచించింది.