New Delhi, Mar 18: దేశంలో కరోనా వైరస్ (Coronavirus Outbreak) పడగవిప్పి బుసలు కొడుతోంది. కోవిడ్ 19 వైరస్ (COVID-19) రోజు రొజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ట చర్యలు చేపట్టాయి. భారత్‌లో ఇప్పటికే కరోనా బాధితుల సంఖ్య (coronavirus cases in India) 130కి చేరింది. మూడు మరణాలు కూడా నమోదయ్యాయి.
దేశంలో కరోనా వ్యాప్తిని కట్టడి చేయాలన్న ఉద్ధేశంతో మార్చి 31 వరకు దేశంలోని పాఠశాలలు, యూనివర్సిటీలతో సహా థియేటర్లు, వ్యాయామ శాలలు మూసివేయాలని కేంద్ర వైద్యారోగ్యశాఖ సోమవారం రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు తాజ్ మహల్ (Taj Mahal) సందర్శనను నిలిపివేస్తున్నట్లు కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ ప్రకటించింది.
కరోనా వ్యాప్తి దృష్ట్యా టిక్కెట్లు ద్వారా ప్రవేశించే అన్ని చారిత్రక కట్టడాలు, అన్ని స్మారక చిహ్నాలు, కేంద్ర మ్యూజియాలను, ఎర్రకోట, తాజ్ మహాల్ మార్చి 31 వరకు మూసివేస్తున్నాం. దీనిని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం’ అని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ పటేల్ (Union Culture Minister Prahlad Patal) ప్రకటించారు. వీటితోపాటు దేశంలోని పలు దేవాలయాల్లో భక్తుల రాకపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు విధించాయి.
మహారాష్ట్రలోని షిరిడి (Shirdi Temple closed), మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయం కూడా మార్చి 31 వరకు మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా దేశ చరిత్రలో తాజ్ మహల్ మూతపడటం ఇది మూడోసారి. మొదటి సారి 1971లో పాకిస్తాన్‌తో యుద్ధ సమయంలో.. అలాగే 1978లో వరదల నేపథ్యంలో రెండో సారి కొన్ని రోజుల పాటు సందర్శనను నిలిపి వేశారు.