New Delhi, June 20: భారతదేశంలో ఒకరోజును మించి ఒకరోజు రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా మరో 14,516 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు దేశంలో ఒకరోజులో ఇంత పెద్దమొత్తంలో కేసులు రావడం ఇదే తొలిసారి. దీంతో దేశంలో మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య ఆదివారం ఉదయం నాటికి 3,95,048 కు చేరింది. నిన్న ఒక్కరోజే 375 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 12,948 కు పెరిగింది.
నిన్న దేశవ్యాప్తంగా 9,120 మంది కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 2,13 831 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం దేశంలో 1,68,269 ఆక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
COVID తీవ్రత అధికంగా ఉన్న దేశంలోని వివిధ రాష్ట్రాల జాబితా
ప్రపంచం 'ప్రమాదకర దశ'లో ఉంది
ప్రపంచవ్యాప్తంగా COVID -19 మహమ్మారి విజృంభిస్తున్న వేళ ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. ప్రపంచం ఒక "కొత్త మరియు ప్రమాదకరమైన దశ" లోకి నెట్టబడినట్లు డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రపంచ దేశాలలో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది, మహమ్మారి మరింత ఉధృతం అవుతోంది అయితే ప్రజలు ఇప్పటికే నిర్బంధాలతో విసుగు చెంది ఉండవచ్చు, మరియు దేశాలు తమ ఆర్థిక వ్యవస్థలను పున:ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటుండవచ్చు, కానీ ఇప్పుడే అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన సమయం అంటూ WHO చీఫ్ నొక్కి చెప్పారు.