COVID 19 Outbreak in India | PTI Photo

New Delhi, March 19: భారతదేశంలో కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య (Coronavirus Outbreak in India) గురువారం నాటికి 173 కి చేరిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందులో ప్రస్తుతం 155 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా, 14 మంది రోగులు డిశ్చార్జ్ అయినట్లు వెల్లడించింది. మరొకరు ఇతర ప్రాంతానికి తరలిపోయారు. వైరస్ ప్రభావంతో భారతదేశంలో ఇప్పటివరకు దిల్లీ, మహారాష్ట్ర మరియు కర్ణాటక నుంచి ఒక్కొక్కరు చొప్పున మూడు మరణాలు నమోదైనట్లు గురువారం  ఉదయం వెల్లడించిన హెల్త్ బులెటిన్ లో పేర్కొన్నారు.

గురువారం సాయంత్రం భారతదేశంలో మరో కారోనావైరస్ నమోదైంది. ఇటలీ నుంచి వచ్చిన పంజాబ్ వాసి గురువారం మృతిచెందారు. తాజా మరణంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 4కు చేరారు.

కరోనాకట్టడి కోసం కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 29 వరకు అంతర్జాతీయ విమానాలపై నిషేధం విధించింది. అప్పటివరకు భారత అంతర్జాతీయ సరిహద్దులను మూసి వేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.

ఇక భారత్ లో నమోదైన కరోనావైరస్ పాజిటివ్ కేసుల్లో 25 మంది విదేశీ పౌరులు కూడా ఉన్నారు, వీరిలో ఇటలీ నుండి 17, ఫిలిప్పీన్స్ నుండి 3, యుకె నుండి ఇద్దరు, కెనడా, ఇండోనేషియా మరియు సింగపూర్ల నుంచి ఒక్కొక్కరు ఉన్నారు.

ఇక అత్యధిక కేసులు మహారాష్ట్రలో (Maharashtra)  నమోదయ్యాయి. అక్కడ ఇప్పటివరకు 42 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కేరళ 27 కేసులతో ఆ తరువాత స్థానంలో ఉంది. తెలంగాణలో బుధవారం ఒక్కరోజులో 8 కేసులు నమోదవడంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13కు చేరినట్లు వైద్య, ఆరోగ్య శాఖ ధృవీకరించింది.  తెలంగాణలో వంద ప్రత్యేక బృందాలను రంగంలోకి దించిన ప్రభుత్వం

హరియాణలో 17 కేసులు నమోదు కాగా, ఇందులో 14 మంది విదేశీయులే కావడం గమనార్హం. రాజస్థాన్‌లో 7, కేంద్ర పాలిత ప్రాంతాలు లడఖ్‌లో 8, జమ్మూ కాశ్మీర్ కేసులు 4 కేసులు ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, పాండిచేరి, చండీఘర్ మరియు పంజాబ్ నుండి రెండు చొప్పుమ కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి.

దేశవ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో, ఈ రోజు రాత్రి 8 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. కరోనావైరస్ ను ఎదుర్కోవటానికి చేసే ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు, ప్రజల సహకారం గురించి మోదీ మాట్లాడనున్నట్లు ప్రధాని కార్యాలయం ప్రకటించింది.