Hyderabad, March 19: తెలంగాణ రాష్ట్రంలో (Telangana) కరోనావైరస్ కేసుల్లో అకస్మాత్తుగా, మరో 8 కోవిడ్ -19 పాజిటివ్ కేసులను రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ బుధవారం నివేదించింది. దీంతో తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 13 కి చేరుకుంది. ఇందులో 7 మంది ఇండోనేషియన్ దేశస్తులే కావడం గమనార్హం. ఇక వీరితో సంబంధం లేకుండా మార్చి 16న తెల్లవారుజామున స్కాట్లాండ్ నుండి హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన 22 ఏళ్ల యువకుడికి కరోనావైరస్ అని నిర్ధారణ అయింది. ఇది రాష్ట్రంలో 8వ కేసుగా నివేదించబడింది.
కాగా, COVID-19 పాజిటివ్ అని తేలిన 7 మంది ఇండోనేషియన్లతో (Indonesians) కరీంనగర్ సిటీలో తీవ్ర కలకలం రేపింది. వీరంతా 2 రోజుల పాటు కరీంనగర్ (Karimnagar) లో సంచరిస్తూ, మసీదులో గడిపినట్లు తెలిసింది. కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. శంషాబాద్‌లో ల్యాండ్ అయిన ఏ ఒక్క అంతర్జాతీయ ప్రయాణికుడిని సిటీలోకి అనుమతించకుండా నేరుగా విమానాశ్రయం నుంచే ఐసోలేషన్ కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేసింది.
అయితే ఈ ఇండోనేషియన్ దేశస్థులు మాత్రం మొత్తం 10 మంది బృందంగా ముందు దిల్లీ చేరుకొని, అక్కడ్నించి మార్చి 13న 'ఆంధ్రప్రదేశ్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్' (రైలు నంబర్ 12708) ద్వారా మార్చి 14 తెల్లవారుజామున రామగుండం స్టేషన్‌లో దిగారు. వీరు ప్రయాణించిన ఎయిర్ కండిషన్డ్ స్లీపర్ కోచ్‌లో మొత్తం 82 మంది ప్రయాణికులు ఉన్నారు. 'మన రాష్ట్రాన్ని మనమే కాపాడుకోవాలి'- సీఎం కేసీఆర్ అత్యవసర ఉన్నతస్థాయి సమావేశం
రామగుండం స్టేషన్లో దిగిన ఈ 10మంది ఇండోనేషియన్ల బృందం అక్కడ్నించి నేరుగా రోడ్డు మార్గంలో కరీంనగర్ సిటీ బయలుదేరారు. అయితే ఇందులో ఒక 58 ఏళ్ల వ్యక్తికి దిల్లీ నుంచి వచ్చేటపుడే ఫ్లూ లక్షణాలతో రైలు ప్రయాణం చేసినట్లు సమాచారం, ఏసీ బోగిలో ప్రయాణం చేయడంతో పరిస్థితి మరింత దిగజారింది. దీంతో కరీంనగర్‌లో ఆసుపత్రికి వెళ్లగా, వారు వెంటనే హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి రిఫర్ చేశారు. గాంధీలో పరీక్షలు నిర్వహించగా మార్చి 17 మంగళవారం వచ్చిన రిపోర్టులో పాజిటివ్ అని తేలింది. అప్రమత్తమైన అధికారులు వెంటనే ఇతడితో పాటు ఉన్న మిగతా వారికి టెస్టులు నిర్వహించగా మరో 6 మందికి పాజిటివ్ అని తేలింది. హైదరాబాద్‌కు అంతర్జాతీయ విమానాల రాకను రద్దు చేయాలని కోరిన తెలంగాణ ప్రభుత్వం
దీంతో వీరు రెండు రోజులుగా సంచరించిన కరీంనగర్‌లో ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. జనాలను ఇళ్లకే పరిమితమవ్వాల్సిందిగా కోరింది. సుమారు వంద ప్రత్యేక బృందాలను ప్రభుత్వం రంగంలోకి దించింది. ఈ బృందం కరోనాప్రభావిత ఇండోనేషియన్లు బస చేసిన, మరియు సంచరించిన ప్రాంతాల్లో 3 కిలో మీటర్ల పరిధిలో ఇంటింటికి తిరుగుతూ ఆ ఇంట్లో ఉన్న వారందరికీ టెస్టులు నిర్వహించనున్నారు. అనుమానం వచ్చిన వారిని ఐసోలేషన్ కేంద్రాలకు తరలించనున్నట్లు సమాచారం.