International passengers arriving at Indian Airports and Coronavirus scanner in place. (Photo : Twitter)

Hyderabad, March 18: తెలంగాణలో (Telangana) మరో కోవిడ్ -19 పాజిటివ్ (Coronavirus Positive) కేసు బుధవారం నమోదైంది. యూకే నుంచి వచ్చిన ఓ వ్యక్తికి వైద్యపరీక్షల్లో కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. దీంతో తెలంగాణలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6కు చేరింది. కాగా, తొలికేసుగా నమోదైన వ్యక్తి వైరస్ నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జి కాగా, తాజా కేసుతో కలిపి మొత్తం 5 మందికి గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

ఇక రాష్ట్రంలో కరోనావైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేంధర్ (Etala Rajender) బుధవారం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. 'నిర్బంధ పీరియడ్' లో ఉండే వారికి మైరుగైన ఆహారం, నీరు, శుభ్రత తదితర అన్ని ఏర్పాట్లు చూడాలని అధికారులను ఆదేశించారు.

అలాగే రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసులన్నీ విదేశాల నుంచి వచ్చిన వారే కావడంతో వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడం కోసం కొన్ని రోజుల శంషాబాద్ విమానాశ్రయానికి అంతర్జాతీయ విమానాల రాకను రద్దు చేయాలని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్షవర్ధన్ కు ఈటల విజ్ఞప్తి చేశారు. 7 దేశాల్లో 276 మంది ఇండియన్లకు కరోనా పాజిటివ్, స్వదేశానికి రప్పించే ప్రయత్నాలు చేస్తున్న కేంద్రం

కరోనావైరస్ కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం వీలైనన్నీ చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ఇప్పటికే స్కూళ్లు, కాలేజీలకు సెలవులతో పాటు, మాల్స్, పబ్స్, థియేటర్స్ ఇతరత్రా వాటిపై మార్చి 31 వరకు బంద్ ప్రకటించింది. తెలంగాణ సచివాలయానికి కూడా సందర్శకులకు అనుమతిని నిషేధించింది. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే సంబంధిత శాఖకు ముందుగా సమాచారం చేరవేసిన తర్వాత అనుమతించడం జరుగుతుంది.

ఇక కరోనావైరస్ వ్యాప్తి దృష్ట్యా హైదరాబాద్ శివారులోని ప్రసిద్ధ చిలుకూరు బాలాజీ ఆలయాన్ని మూసివేస్తున్నట్లు అర్చకులు ప్రకటించారు. రేపు గురువారం నుంచి మార్చి 25 వరకు ఆలయాన్ని మూసివేస్తున్నట్లు తెలిపారు. అయితే స్వామి వారికి పూజలు యధావిధిగా అర్చకులు నిర్వహిస్తారు, కానీ భక్తులెవ్వరినీ లోనికి అనుమతించరని వెల్లడించారు.