CM KCR Emergency Meeting: తెలంగాణ సీఎం కేసీఆర్ అత్యవసర ఉన్నతస్థాయి సమావేశం, రాష్ట్రంలో కరోనావైరస్ కట్టడిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్న ముఖ్యమంత్రి
Telangana CM K Chandrashekar Rao | File Photo

Hyderabad, March 19:  తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ వ్యాప్తి (COVID-19 Outbreak) చెందకుండా తీసుకోవలసిన చర్యలపై చర్చించేందుకు గురువారం అత్యవసర, అత్యున్నత రాష్ట్ర స్థాయి సమావేశం (Emergency Meeting) నిర్వహించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (CM KCR)  నిర్ణయించారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో జరిగే ఈ సమావేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలను ఆహ్వానించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, మున్సిపల్ శాఖ మంత్రి కె.టి. రామారావు, పంచాయతిరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, హైదరాబాద్ కు చెందిన మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మల్లా రెడ్డి, డిప్యూటి స్పీకర్ పద్మారావు సహా ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులు, కమిషనర్లను ఈ సమావేశానికి ఆహ్వానించారు.

దిల్లీ  నుంచి కరీంనగర్‌కు వచ్చిన కొంతమంది ఇండోనేషియన్లకు కరోనావైరస్ పాజిటివ్ అని తెలియడంతో రాష్ట్ర వ్యాప్తంగా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో తలెత్తిన పరిస్థితిని, తీసుకోవలసిన జాగ్రత్తలను, పాటించాల్సిన నియంత్రణ పద్ధతులను గురువారం నాటి సమావేశంలో విస్తృతంగా చర్చిస్తారు. విదేశాల నుండి వచ్చిన వారి ద్వారానే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నందున ఎట్టి పరిస్థితుల్లోను విదేశాల నుండి వచ్చిన వారు సంపూర్ణ వైద్య పరీక్షలు చేసుకోవాలని సీఎం సూచించారు. ఈ విషయంలో ప్రజలు కూడా అప్రమత్తమై ప్రభుత్వానికి సమాచారమందించాలని, స్వీయ ఆరోగ్య పరిరక్షణ చర్యలు తీసుకోవాలని సీఎం కోరారు. విదేశాల నుండి వచ్చినవారు ఎవరినైనా సరే సంపూర్ణ పరీక్షలు జరిపిన తరువాతనే ఇండ్లకు పంపాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభుత్వం ఇప్పటికే కొన్ని అంశాల్లో 15 రోజుల కార్యాచరణ, మరికొన్ని అంశాల్లో వారం రోజుల కార్యాచరణ ప్రకటించి అమలు చేస్తున్నది. ఈరోజు జరిగే సమావేశంలో మరిన్ని నియంత్రణ చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

రాష్ట్రంలో ప్రజలు ఎక్కువగా గుమిగూడే కార్యక్రమాలన్నింటిని రద్దు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. సామూహికంగా జరిగే పండుగలు, ఉత్సవాలకు కూడా దూరంగా ఉండాలని ప్రజలకు సూచించింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం తీసుకునే చర్యలను ప్రజలు అర్థం చేసుకుని మన రాష్ట్రాన్ని మనమే కాపాడుకోవాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.