omicron (Photo-IANS)

Chennai, June 6: దేశ వ్యాప్తంగా మళ్లీ క‌రోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. కరోనా ఫోర్త్ వేవ్ ఛాయలు కనిపిస్తున్నాయి. తాజాగా త‌మిళ‌నాడులో ఒమిక్రాన్ కొత్త‌ స‌బ్ వేరియంట్ కేసులు 12 (12 cases of Omicron subvariants) న‌మోదైన‌ట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఎం సుబ్ర‌మ‌ణియ‌న్ మీడియాకు వెల్ల‌డించారు. మొత్తం 300 శాంపిళ్ల‌ను హైద‌రాబాద్‌లోని డీఎన్ఏ ఫింగ‌ర్ ప్రింటింగ్, డ‌యాగ్నోస్టిక్‌కు పంపించ‌గా, ఇందులో 12 న‌మూనాల్లో ఒమిక్రాన్ కొత్త స‌బ్ వేరియంట్లు (Omicron subvariants) బ‌య‌ట‌ప‌డ్డాయ‌ని ఆరోగ్య మంత్రి పేర్కొన్నారు.

ఇందులో న‌లుగురిలో బీఏ.4, మ‌రో 8 మందిలో బీఏ.5 వేరియంట్ బ‌య‌ట‌ప‌డింద‌న్నారు. ఏదేమైన‌ప్ప‌టికీ.. ఈ 12 మంది ఆరోగ్యంగా ఉన్నార‌ని ఎం సుబ్ర‌మ‌ణియ‌న్ స్ప‌ష్టం చేశారు. వీరంతా ఆరోగ్య శాఖ అధికారుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉన్న‌ట్లు తెలిపారు. కొత్త వేరియంట్ న‌మోదైన వారి కాంటాక్ట్స్‌ను గుర్తించే ప‌నిలో ఆరోగ్య శాఖ అధికారులు నిమ‌గ్న‌మైన‌ట్లు మంత్రి పేర్కొన్నారు.

దేశంలో ఆదివారం 4270 మందికి పాజిటివ్‌ నిర్ధారణకాగా, నేడు మరో 4518 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో మొత్తం కేసులు 43,181,335కు చేరాయి. ఇందులో 4,26,30,852 మంది బాధితులు కోలుకోగా, ఇప్పటివరకు 5,24,701 మంది మృతిచెందారు. ఇంకా 25,782 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 9 మంది మరణించగా, 2,779 మంది డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం కేసుల్లో 0.06 కేసులు యాక్టివ్‌గా ఉండగా, రికరీ రేటు 98.73 శాతం, మరణాల రేటు 1.22 శాతంగా ఉందని తెలిపింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,94,12,87,000 కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని, ఆదివారం ఒక్కరోజే 2,57,187 మందికి వ్యాక్సిన్‌ ఇచ్చామని పేర్కొన్నది