Representational image (Photo Credit- ANI)

పశ్చిమ బెంగాల్‌లో నలుగురికి చైనాలో విస్తరిస్తున్న బీఎఫ్‌.7 సోకినట్లు నిర్ధరణ అయింది. అమెరికా నుంచి ఇటీవలే భారత్‌కు వచ్చిన నలుగురి నమూనాలు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపించగా.. బీఎఫ్‌.7 వేరియంట్‌ సోకినట్లు తేలిందని అధికారులు వెల్లడించారు.

ప్రస్తుతం బాధితుల ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు.ఈ నలుగురితో సన్నిహితంగా మెలిగిన 33 మందిని గుర్తించి పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. వారందరినీ నిశితంగా పరిశీలిస్తున్నామని, ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వెల్లడించారు.

కొత్త వేరియంట్ ప్రమాదకరమా, భారత్‌లో ఈ వేరియంట్‌కి సంబంధించి 5 కేసులు నమోదు, ఎక్స్‌బీబీ.1.5 వేరియంట్ గురించి కొన్ని నిజాలు..

దేశంలో గత 24 గంటల్లో 1,93,051 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 188 కేసులు బయటపడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,79,319కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2,554 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24గంటల్లో ముగ్గురు మృతి చెందడంతో మొత్తం మరణాల సంఖ్య.. 5,30,710కి చేరింది.

ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల్లో 0.01 కేసులు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయని వెల్లడించింది. రికవరీ రేటు 98.80 శాతంగా, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 220.12 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.