New Delhi, May 8: కరోనా పాజిటివ్ రోగుల్ని ఆస్పత్రిలో చేర్చుకోవడానికి కచ్చితంగా ఆ రిపోర్ట్ అవసరం లేదని (COVID-19 Positive Test Report Not Mandatory) కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు కోవిడ్ రిపోర్ట్ ఉండాలనే నిబంధనను సవరిస్తూ శనివారం ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్ ఆరోగ్య సదుపాయంలో భాగంగా చికిత్ప కోసం కోవిడ్-19 పాజిటివ్ రిపోర్ట్ ఉండాలనే నిబంధనను ప్రభుత్వం తొలగించింది.
ఆరోగ్య మంత్రిత్వ శాఖ ( Union Health Ministry) ప్రకారం..ఏ రోగికి కూడా చికిత్స నిరాకంచవద్దు. రోగి వేరే నగరానికి చెందినవాడైనప్పటికీ అవరమైన మందులు, ఆక్సిజన్ అందించాల్సిందేనని ఓ ప్రకటనలో పేర్కొంది. చికిత్సకు వచ్చే వారిని సీసీసీ, డీసీహెచ్‌సీ, డీహెచ్‌సీ వార్డులో అనుమానిత కేసులుగా చేర్చుకోవాలని సూచించింది.
కోవిడ్-19తో బాధపడుతున్న రోగులకు సత్వరం, సమర్థవంతమైన చికిత్స అందించాలని తెలిపింది. ఆసుపత్రిలో రోగిని అవసరాన్ని బట్టి చేర్చుకోవాలని, పడకలు నిబంధనలకు విరుద్దంగా ఆక్రమించకుండా చూసుకోవాలని తెలిపింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు తమ నిబంధనలను పాటించాలని ఆదేశాలు జారీ చేసింది.
కేంద్రం జారీ చేసిన నూతన మార్గదర్శకాలు ఇవే:
కోవిడ్ లక్షణాలు ఉన్నవారిని ఆసుపత్రుల్లో చేర్చుకునేందుకు కరోనా పాజిటివ్ రిపోర్ట్ తప్పనిసరి కాదు. అనుమానం ఉన్న బాధితులందరినీ చేర్చుకుని, చికిత్స అందించాల్సిందే.
ఏ కారణం వల్లా బాధితుడికి వైద్యం నిరాకరించరాదు. ఇతర ప్రాంతాలకు చెందిన రోగులకు కూడా అత్యవసర ఔషధాలు, ఆక్సిజన్ అందించాలి.
గుర్తింపు కార్డులు లేకున్నా ఆసుపత్రుల్లో చేర్చుకోవాలి. సరైన ధ్రువీకరణ పత్రాలు లేవనే కారణంతో బాధితులను చేర్చుకోకుండా ఉండకూడదు.
డిశ్చార్జ్ పాలసీని ఆసుపత్రులు కచ్చితంగా పాటించాలి. హాస్పిటల్ సేవలు అవసరం లేని వారిని డిశ్చార్జ్ చేయాలి.
అన్ని రాష్ట్రాల సీఎస్ లు మూడు రోజుల్లోగా ఈ నిబంధనలను అనుసరిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలి.