Mumbai, Jan 10: కరోనావైరస్ ప్రపంచ వ్యాప్తంగా కల్లోలం రేపుతున్న నేపథ్యంలో దానికి యుకెలో పుట్టిన కరోనావైరస్ తోడయింది. ఇది ప్రపంచాన్ని వణికిస్తోంది. తాజాగా ఇండియాలో కూడా ఓ కొత్త వైరస్ ని కనుగొన్నారు. ప్రమాదకరమైన మరో కరోనా మ్యుటేషన్ ఇండియాలో ముంబై నగరంలో వెలుగులోకి వచ్చింది. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌కు ( Mumbai Metropolitan Region) చెందిన ముగ్గురు కరోనా పేషెంట్ల శాంపిల్స్‌లో ఈ మ్యుటేషన్‌ను (E484K Mutation) ఖర్గార్‌లోని టాటా మెమోరియల్ సెంటర్ కనుగొన్నది. దీనికి E484K మ్యుటేషన్‌గా పిలుస్తున్నారు.
సౌతాఫ్రికాలో కనిపించిన మూడు మ్యుటేషన్ల ((K417N, E484K and N501Y)లో ఈ మ్యూటేషన్ కూడా ఒకటని ఇక్కడి అసోసియేట్ ప్రొఫెసర్ నిఖిల్ పట్కార్ వెల్లడించారు. మొత్తం 700 శాంపిల్స్‌కు జెనెటిక్ సీక్వెన్సింగ్ చేస్తుండగా.. అందులో ముగ్గురిలో ఈ మ్యుటేషన్ కనిపించినట్లు చెప్పారు. ఇది శరీరంలోని యాంటీ బాడీస్‌ను పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుంటోందని తెలిపారు. ఇప్పుడు అందరి దృష్టీ యూకే వేరియంట్‌పై ఉండగా.. దాని కంటే సౌతాఫ్రికాలో కనిపించిన ఈ E484K ఇంకా ప్రమాదకరంగా కనిపిస్తోందనే వార్తలు వస్తున్నాయి.
రానున్న కరోనావ్యాక్సిన్ ప్రధానంగా యాంటీ బాడీలను వృద్ధి చేస్తుంది. అయితే ముంబైలో పుట్టిన కొత్త వేరియంట్ ఆ యాంటీ బాడీలనే బోల్తా కొట్టిస్తుండటం వల్ల అసలు వ్యాక్సినేషన్ వల్ల ప్రయోజనం ఉంటుందా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నవీ ముంబై, పాన్వెల్, రాయ్‌గడ్‌లలోని కొవిడ్ పేషెంట్ల జెనెటిక్ సీక్వెన్సింగ్ చేస్తోంది టాటా మొమోరియల్ సెంటర్. ఇప్పుడీ కొత్త మ్యుటేషన్ వచ్చిన పేషెంట్లు గత సెప్టెంబర్‌లో కొవిడ్ బారిన పడినట్లు డాక్టర్ నిఖిల్ పట్కార్ చెప్పారు. వీళ్లకు చాలా స్వల్పమైన లక్షణాలు మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. ఇద్దరు కేవలం ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉండగా.. ఒకరు మాత్రం ఆసుపత్రిలో సాధారణ చికిత్స తీసుకున్నారు.
గత ఏప్రిల్ నెలలో ACTREC టీం ఈ మ్యూటేషన్ కి సంబంధించి నాలుగు లేక అయిదు శాంపిల్స్ కనుగొనగా.. సెప్టెంబర్ నాటికి అవి 10 నుంచి 12కి పెరిగాయి. SARS-CoV-2 సోకిన ముగ్గురు వ్యక్తుల్లో ఈ కొత్త మ్యూటేషన్ కనుగొన్నారు. వారిలో ఇద్దరు రాయ్ ఘడ్ కి చెందిన వారు కాగా మరొకరు థానేకి చెందిన వారిగా వైద్యులు గుర్తించారు.