Oslo, Jan 16: కరోనా వ్యాక్సిన్ మీద ఆశలు చిగురిస్తున్న నేపథ్యంలో పలు విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా నార్వేలో మరో విషాదం చోటు చేసుకుంది. కోవిడ్ వ్యాక్సిన్ (COVID Vaccination) తీసుకున్న వారిలో 23 మంది వృద్ధులు మరణించారు. ఈ హఠాత్పరిణామంతో నార్వే ప్రభుత్వం (Norway Govt) బాగా ముసలివారు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు వ్యాక్సిన్ తీసుకోవద్దని సూచించింది. కాగా ఫైజర్ ఎన్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవిడ్ వ్యాక్సిన్ (Pfizer vaccine) ఫస్ట్ డోసు తీసుకున్న వారిలో 23 మంది వృద్ధులు మరణించారు.
వీరిలో 13 మందికి శవపరీక్షలు నిర్వహించగా.. టీకా తీసుకున్న తర్వాత వచ్చే సాధారణమైన దుష్ర్పభావాలు తలెత్తి.. అవి తీవ్రంగా మారి మరణించారని నార్వేజియన్ మెడిసిన్స్ ఏజెన్సీ తెలిపింది. అంతేకాక వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కనిపించే సాధారణ సైడ్ ఎఫెక్ట్స్ కూడా బాగా బలహీనంగా ఉన్న వారిలో తీవ్రంగా మారాయన్నారు. బాగా ముసలివారు, అనారోగ్య సమస్యలతో ఉన్న వారు వ్యాక్సిన్ తీసుకోకపోవడమే మంచిదని నార్వే అధికారులు సూచించారు.
అతి తక్కువ జీవితకాలం ఉన్నవారు టీకా తీసుకోవడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని.. వారికి టీకా అనవసరం అన్న అభిప్రాయాన్ని నార్వే ఆరోగ్య శాఖ వ్యక్తం చేసింది. ఆరోగ్యవంతులు, యువకులు టీకాను తీసుకోవచ్చు అని నార్వే ప్రభుత్వం తెలిపింది. ఇక తమ వ్యాక్సిన్ తీసుకుని 23 మంది మరణించిన ఘటనపై ఫైజర్ కంపెనీ విచారణ చేపడుతున్నది.
టీకా వల్ల సమస్యలు ఎదుర్కొంటున్న వారి సంఖ్య తక్కువగానే ఉందని, తాము ముదుగా అనుకున్న రీతిలో సంఘటనలు జరుగుతున్నట్లు ఫైజర్ ఓ ప్రకటనలో పేర్కొన్నది. ఇక ఇప్పటి వరకు నార్వేలో వైరస్ వల్ల రిస్క్ ఉన్న సుమారు 33 వేల మందికి టీకా ఇచ్చారు. 29 కేసుల్లో సైడ్ ఎఫెక్ట్స్ ప్రభావం ఉండగా.. దాంట్లో మూడో వంతు మంది 80 ఏళ్లు దాటినవారే ఉన్నారు.
ఈ మరణాల నేపథ్యంలో నార్వే ప్రభుత్వం, ఫైజర్ బయోటెక్ సమగ్ర దర్యాప్తును చేపట్టాయి. వారు ఎందుకు మరణించారు... వ్యాక్సిన్ వల్ల ెలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయనే దానిపై పరిశోధనలు ప్రారంభిస్తున్నారు. అయితే బలహీనంగా ఉన్న వృద్ధులు సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ప్రాణాలు కోల్పోయి ఉంటారని భావిస్తున్నారు. ఏమాత్రం ఆరోగ్యంగా లేని వృద్ధులకు టీకా ఇస్తే, వారిలో సైడ్ ఎఫెక్ట్స్ వల్ల తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నట్లు గుర్తించారు.