Coronavirus Outbreak in India . |(Photo Credits: PTI)

New Delhi, April 26:  గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా భారీగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, ఒక్కరోజులోనే గరిష్ఠంగా 1990 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో భారతదేశంలో COVID-19 బాధితుల సంఖ్య ఆదివారం ఉదయం నాటికి 26,496 కు చేరుకున్నాయి. అదే సమయంలో కొత్తగా మరో 49 మరణాలు నమోదు కావడంతో కరోనావైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య 824కి పెరిగిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో పేర్కొంది.

అయితే ఇక్కడ ఒక ఊరట కలిగించే విషయం ఏమిటంటే కరోనావైరస్ బారినపడి, కోలుకునే వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. నిన్న ఒక్కరోజులోనే దేశవ్యాప్తంగా 758 మంది కోవిడ్-19 బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 5803 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 19868 యాక్టివ్ కేసులు ఉన్నాయని ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. దుకాణాలు తెరుచుకునేందుకు అనుమతించిన కేంద్ర ప్రభుత్వం. వేటికి అనుమతిచ్చిందో చూడండి

రాష్ట్రాల వారీగా నమోదవుతున్న కోవిడ్-19 కేసుల సంఖ్యను చూస్తే మహారాష్ట్ర ఎప్పట్లాగే అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇక్కడ పరిస్థితుల్లో ఏ మాత్రం మార్పు కనిపించడం లేదు. మహారాష్ట్రలో మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య ఈరోజు ఉదయం నాటికి 7628 కు చేరగా, మరణాల సంఖ్య 323కు పెరిగింది.

మహారాష్ట్ర తర్వాత గుజరాత్ రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి ఎక్కువవుతోంది. గుజరాత్‌లో పాజిటివ్ కేసులు 3071 దాటగా, మరణాల సంఖ్య 133కు పెరిగింది. ఆ తర్వాత దిల్లీలో 2625 కేసులు, మధ్యప్రదేశ్‌లో 2096, రాజస్థాన్ రాష్ట్రంలో 2083, తమిళనాడులో 1821 కేసులు ఇప్పటివరకు నమోదైనట్లు ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి.

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే కొత్తగా నమోదవుతున్న కోవిడ్1-9 కేసుల సంఖ్యతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాన్ని అధిగమించింది. ఏపీలో కేసుల సంఖ్య వెయ్యి దాటి 1016కు ఎగబాకగా, తెలంగాణలో 990 వద్ద నిలిచింది.