
New Delhi, JAN 18: ఢిల్లీలో ఉదయం 10.20 గంటల నుంచి 12.45 గంటలకు వచ్చే ఎనిమిది రోజులు విమాన సర్వీసుల (Flight Operations) రాకపోకలపై నిషేధం విధించినట్లు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ ఆపరేటర్ ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయ సంస్థ (DIAL) ప్రకటించింది. ఈ నెల 26న గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీఐఏఎల్ శనివారం ప్రకటించింది. దేశంలోనే అత్యంత బిజీగా ఉండే విమానాశ్రయంగా ఇందిరాగాంధీ అంతర్జాతీయ సంస్థ (IGIA) నిలుస్తుంది. ప్రతి రోజూ 1300 విమాన సర్వీసులు నడుస్తాయి.
ఈ నిషేధాజ్ఞల ప్రభావం షెడ్యూల్డ్ విమాన సర్వీసుల నిర్వహణపై ఉంటుందా? అని వెల్లడి కాలేదు. ‘రిపబ్లిక్ డే వీక్ సందర్భంగా నోటమ్ (నోటీస్ టూ ఎయిర్‌మెన్) ప్రకారం ఢిల్లీ విమానాశ్రయం నుంచి ఈ నెల 19 నుంచి 26 వరకూ ఉదయం 10.25 గంటల నుంచి 12.45 గంటల వరకూ విమానాల రాకపోకలు ఉండవు’అని డీఐఏఎల్ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది. ప్రయాణికులు సంబంధిత విమానయాన సంస్థలతో తాము ప్రయాణించే విమాన సర్వీసుల అప్‌డేటెడ్ సమాచారం తనిఖీ చేసుకోవాలని సూచించింది.