Satellite picture of cyclone Amphan (Photo Credits: IMD)

Odisha, May 20: అంఫాన్‌ తుఫాన్‌ (Cyclone Amphan) తీరంవైపు పరుగులు పెడుతోంది. ఈ తుపాను మంగళవారం బలహీనపడి, అత్యంత తీవ్ర తుపానుగా మారింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం బలపడి వాయుగుండంగా, తర్వాత తుఫాన్‌గా, ఆ తర్వాత మహాతుఫాన్‌గా మారి ఉత్తర దిశగా వేగంగా కదులుతున్నది. అంఫాన్‌గా పేరు ఖరారైన ఈ తుఫాన్‌ బుధవారం ఒడిశా, పశ్చిబెంగాల్‌ మధ్యలో తీరాన్ని తాకుతుందని భారత వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే ప్రకటించారు. ఉగ్రరూపం దాల్చిన అంఫాన్ తుఫాన్, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌కు భారీ వర్ష ముప్పు, ఏపీలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం

ఒడిశా, పశ్చిమబెంగాల్‌లోని తీర ప్రాంత జిల్లాల్లో విధ్వంసం (Rainfall & Strong Winds Hit Bhadrak) సృష్టించే స్థాయిలోనే ఉంది. దాంతో, ఆ రాష్ట్రాలు ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. తుపాను ప్రభావం ఉండే తీర ప్రాంతాల నుంచి లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. కోల్‌కతాకు దక్షిణంగా 180 కి.మీల దూరంలో ఉన్న దిఘాకు, బంగ్లాదేశ్‌లోని హతియా దీవికి మధ్య బుధవారం మధ్యాహ్నానికి తుపాను తీరం దాటొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. ఆ సమయంలో తీరం వెంబడి పెనుగాలుల వేగం 165 కి.మీల వరకు ఉండొచ్చుని భువనేశ్వర్‌లోని వాతావరణ శాఖ అధికారి వెల్లడించారు.

Strong winds in Bhadrak:

ఆంధ్రప్రదేశ్‌ తీరంపై అంఫాన్‌ ప్రభావం బలంగా కనిపిస్తున్నది. తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ సముద్ర తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి. ఇక్కడ తీరం అల్ల కల్లోలంగా మారింది. అలాగే తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది దగ్గర సముద్రం 50 మీటర్ల ముందుకు చొచ్చుకొచ్చింది. దీంతో మత్స్యకార గ్రామాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. సరుగుడు తోటలు సముద్రపు కోతకు గురయ్యాయి. అలల కల్లోలం వల్ల సముద్రం 20 మీటర్ల మేర ముందుకు వచ్చింది.

పశ్చిమబెంగాల్, ఒడిశాల్లో జాతీయ విపత్తు స్పందన దళం(NDRF)కు చెందిన 41 బృందాలను మోహరించామని ఎన్‌డీఆర్‌ఎఫ్‌ చీఫ్‌ ఎస్‌ఎన్‌ ప్రధాన్‌ తెలిపారు. బెంగాల్‌ తీర ప్రాంతాల నుంచి సుమారు 3 లక్షల మందిని తుపాను సహాయ కేంద్రాలకు తరలించామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమత బెనర్జీ తెలిపారు. గత సంవత్సరం ఫని, బుల్‌బుల్‌ తుపానులను ఎదుర్కొన్న అనుభవం ఇప్పుడు ఉపయోగపడుతోందని విపత్తు నిర్వహణ మంత్రి జావేద్‌ పేర్కొన్నారు. అంఫాన్‌ తుపాను సహాయ చర్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పశ్చిమబెంగాల్‌ సీఎం మమత, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌లతో వేర్వేరుగా సమీక్షించారు.