Puri, OCT 23: పూరీ జగన్నాథ్ ఆలయ సందర్శనపై దానా తుఫాన్ (Cyclone Danas Effect) ఎపెక్ట్ పడింది. తుఫాన్ కారణంగా పూరీకి భక్తులు ఎవరూ రావొద్దని వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. పూరీ నుంచి భక్తులను ఖాళీ చేయించాలని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. పూరీలోని బ్లూఫాగ్ బీచ్ తో పాటు ఇతర బీచ్ లన్నీ మూసివేశారు. పూరీ-సాగర్ ఐల్యాండ్ సమీపంలో తుఫాన్ తీరం దాటే అవకాశం ఉండటంతో ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించింది. దానా తుఫాన్ ముంచుకొస్తోంది. దీంతో ఆర్కియాలజికల్ సర్వే ఇండియా ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. పూరీలోని జగన్నాథుడి ఆలయం (Puri Jagannath Temple), కోనార్క్ లోని సన్ టెంపుల్ ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. సైక్లోన్ కారణంగా ఎలాంటి అనుకోని ఘటనలు జరక్కుండా ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ఈ ఆలయాలను మూసి ఉంచాలని ఆదేశాలు ఇచ్చారు.
ఐఎండీ (IMD) అంచనా ప్రకారం దానా తుపాను ఒడిశా తీరం ప్రాంతం బిటార్ కనికా పార్క్, ధమ్రా పోర్ట్ మధ్య తీరం తాకనుంది. అక్టోబర్ 24వ తేదీ రాత్రి నుంచి అక్టోబర్ 25వ తేదీ తెల్లవారుజామున.. ఈ మధ్య సమయంలో తుపాను తీరాన్ని తాకనుంది. తుఫాన్ తీరాన్ని తాకే సమయంలో 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయంది. ఈ పరిస్థితుల్లో ఆలయాలు, జియంలను మూసి ఉంచాలని ఆదేశాలు ఇచ్చారు. అలాగే గంజాం, పూరి, కేంద్రపర, బాలాసోర్, మయూర్ బంజ్, జైపూర్, కటక్ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు కూడా ఇచ్చారు. సౌత్ ఈస్ట్రన్ రైల్వే పరిధిలో నడిచే 150కి పైగా రైళ్లను రద్దు చేశారు.
దానా తుఫాను (Puri Jagannath Temple) వల్ల దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ ఇప్పటికే హెచ్చరించింది. ఈ తుఫాన్ కు దానా అని నామకరణం చేసిన దేశం ఖతర్. దానా అనే పదానికి అరబిక్ లో ఉదారత అని అర్థం. తుఫాన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపైన కూడా ఉంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
తుఫాన్ కారణంగా కేంద్రం అప్రమత్తమైంది. ఒడిశా, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపింది. ఒడిశాకు 20 ఎన్డీఆర్ఎఫ్, వెస్ట్ బెంగాల్ కు 14 ఎన్డీఆర్ఎఫ్ టీమ్ లను పంపింది. దీనికి అదనంగా వరద సహాయక చర్యల నిమితం ఆర్మీ, నేవీ, కోస్ట్ గార్డ్ ల నుంచి రిలీఫ్ టీమ్స్ ను కూడా పంపింది. అంతేకాదు పడవలు, ఎయిర్ క్రాఫ్ట్ లను రెడీ ఉంచింది.
మరోవైపు 5వేల పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఒడిశా ప్రభుత్వం తెలిపింది. ఆ కేంద్రాల్లో తాగునీరు, ఆహారం సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసింది. అలాగే పిల్లలకు పాలు కూడా అందించనుంది. ఇక గాయపడిన వారికి చికిత్స అందించేందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసింది. అవసరమైన మందులను సిద్ధంగా ఉంచింది.