Puri, Oct 23: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉత్తర అండమాన్‌కు చేరువగా సోమవారం ఉదయం ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం బలపడి తీవ్ర రూపం దాల్చిందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఇది తీవ్ర తుఫాన్ దానగా మారింది. ఈ దాన తుఫాన్(Cyclone Dana).. ఇవాళ కానీ రేపు కానీ ఒడిశా, బెంగాల్ తీరాన్ని దాటే అవకాశం ఉన్నది.
గురువారం అర్ధరాత్రినుంచి శుక్రవారం ఉదయంలోగా పూరీ (ఒడిశా), సాగర్ ద్వీపం (పశ్చిమబెంగాల్) మధ్యలో తీరం దాటొచ్చని ఐఎండీ భావిస్తోంది. ఆ సమయంలో తీరం వెంట గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. ఒడిశాలోని బాలాసోర్, భద్రక్, కేంద్రపాద, బయూర్‌బంజ్, జగత్‌సింగ్‌పుర్, పూరి జిల్లాలపై తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉండనున్నది.
తుఫాన్ నేపథ్యంలో భారతీయ వైమానిక దళానికి చెందిన రెండు విమానాలు ఎన్డీఆర్ఎప్ దళాలతో సిద్దంగా ఉన్నాయి. బటిండా నుంచి ఐఎల్ 76, ఏఎన్ 32 విమానాలు రిలీఫ్ మెటీరియల్‌తో భువనేశ్వర్, బెంగాల్‌లోని పలు జిల్లాల్లో 23వ తేదీ నుంచి 26వ తేదీ వరకు స్కూళ్లను మూసివేశారు. పలు జిల్లాలో సుమారు 500 రిలీఫ్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు ఒడిశా మంత్రి సురేశ్ పూజారి తెలిపారు. లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించనున్నట్లు వెల్లడించారు.
గత ఆదివారం ఉత్తర అండమాన్(North Andaman) సముద్రానికి చేరువగా ఏర్పడిన అల్పపీడనం, సోమవారం సాయంత్రం 5.30 గంటలకు తూర్పు మధ్య బంగాళాఖాతం వద్ద తీవ్రంగా మారింది. ఈ అల్పపీడనం పశ్చిమ, వాయువ్య దిశగా కదులుతూ మంగళవారం ఉదయం మధ్య తూర్పు బంగాళాఖాతంలో వాయుగుండంగా మారింది. ఈ వాయుగుండం బుధవారం తుఫానుగా మారింది.
Here's Cyclone Dana Live Tracker
ఆ తుఫాన్ వాయువ్య దిశగా పయనించి గురువారం ఉదయం వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఒడిశా - పశ్చిమబెంగాల్(Odisha - West Bengal) మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ వాయుగుండం కారణంగా మద్రాసు ఓడరేవు, ఎన్నూరు, కాట్టుపల్లి, కారైక్కాల్, తూత్తుకుడి, కడలూరు, నాగపట్టినం, పాంబన్ ఓడరేవుల్లో ఒకటో నెంబర్ తుఫాను సూచిక ఎగురవేశారు.
ఈ వాయుగుండం ప్రభావంతో రెండు రోజులపాటు తూర్పు బంగాళాఖాతం, ఉత్తర అండమాన్ సముద్రం, మధ్య పశ్చిమ బెంగాల్ సముద్రం, ఆంధ్రా సముద్రతీరాల్లో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. కాగా బుధవారం ఏర్పడనున్న తుఫాన్‌కు ఖతార్ దేశం ఇదివరకే ‘డానా’ అనే పేరు పెట్టిన విషయం విధితమే.
బంగాళాఖాతంలో ఏర్పడనున్న తుఫాన్, ఉపరితల ఆవర్తనం కారణంగా తమిళనాడు రాష్ట్రంలో ఐదు రోజుల పాటు చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని స్థానిక వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాష్ట్రంలోను, పుదుచ్చేరి, కారైక్కుడి ప్రాంతాల్లో పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. తంజావూరు, పుదుకోట, శివగంగ(Thanjavur, Pudukota, Sivaganga), మదురై, తేని, దిండుగల్ జిల్లాల్లో బుధవారం పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపారు.
ఈ తుఫాను ప్రభావం ఏపీ రాష్ట్రంపై ఉండకపోవచ్చు. ప్రస్తుత అంచనా ప్రకారం ఒడిశా, పశ్చిమబెంగాల్, స్థానిక పరిస్థితుల వల్ల గమనం మార్చుకుంటే బంగ్లాదేశ్ వైపు వెళ్లొచ్చు. విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. దీనిపై బుధవారంనాటికి స్పష్టత వస్తుంది’ అని ఐఎండీ మాజీ డీజీ డా.కేజే రమేష్ తెలిపారు.
బంగాళాఖాతంలో వాయుగుండం నుంచి తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతోంది. తమిళనాడులో ఈశాన్య రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో రాయలసీమలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో నాలుగు రోజులు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఏపీ రాష్ట్రవ్యాప్తంగా రాబోయే మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
దానా’ తుపాను హెచ్చరికల నేపథ్యంలో 23, 24, 25వ తేదీల్లో తూర్పు కోస్తా రైల్వే పరిధిలో పలు రైళ్లను రద్దు చేశారు. వాటిలో దూర ప్రాంత సర్వీసులు సహా దగ్గర సర్వీసులూ ఉన్నాయి. గురువారం అత్యధికంగా 37 సర్వీసులు రద్దయ్యాయి. రద్దయిన రైళ్లలో ఎక్కువగా హావ్‌డా, భువనేశ్వర్, ఖరగ్‌పూర్, పూరీ తదితర ప్రాంతాలనుంచి రాకపోకలు సాగించేవి ఉన్నాయి. విశాఖ-భువనేశ్వర్ మధ్య రాకపోకలు సాగించే వందేభారత్ రైలును 24న రద్దు చేశారు.