Representational Purpose Only (Photo Credits: Wikimedia Commons)

Vjy, Oct 22: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా అక్టోబర్ 23 నాటికి తుఫాన్‌గా బలపడనుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రెండు రోజుల పాటు ఉత్తరకోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది.ఈనెల 23,24వ తేదీల్లో ఏపీలో భారీ వర్షాలు (Heavy Rains ) కురుస్తాయని వాతావరణశాఖ (Meteorological Department ) హెచ్చరించింది. వాయుగుండం ప్రభావంతో తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్లు వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.

తీరం వైపు వెళ్లే కొద్దీ తుఫాన్ మరింత బలపడనున్నట్లు అధికారులు తెలిపారు. తుఫాను తీరందాటే సమయంలో గంటకు 100-110 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. ప్రస్తుతం పారాదీప్‌కు ఆగ్నేయంగా 700 కిలోమీటర్లు, సాగర్ ద్వీపానికి దక్షిణ - ఆగ్నేయంగా 750 కిలోమీటర్లు, ఖేపుపరా కు ఆగ్నేయంగా 730 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది.

ముంచుకొస్తున్న దన తుఫాను ముప్పు, ఈ సారి ఏపీ, ఒడిషాలకు హై అలర్ట్, వచ్చే మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు

ఇది పశ్చిమ - వాయువ్య దిశగా పయనించి, తూర్పు మధ్య బంగాళాఖాతంలో బుధవారం తుఫానుగా మారే అవకాశం ఉంది. వాయువ్య దిశగా కదులుతూ ఈనెల 24వ తేదీకి తీవ్ర తుపాన్‌గా మారే అవకాశం ఉంది. ఈనెల 24వ తేదీ రాత్రి లేదా 25వ తేదీ ఉదయం పూరీ , సాగర్ ద్వీపం మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ ప్రభావంతో అనకాపల్లి విజయనగరం, మన్యం, శ్రీకాకుళం, విశాఖపట్నం, అల్లూరి జిల్లాల్లోని కొన్ని చోట్ల భారీ వర్షాలు, మిగిలిన చోట్ల విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్‌ కూర్మనాథ్ తెలిపారు.

ఇప్పటికే సముద్రంలో చేపలు వేటకు వెళ్లిన మత్య్సకారులు తీరానికి చేరుకోవాలని సూచించింది. అలాగే రాష్ట్రంలో అన్ని పోర్టులలో ఒకటవ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యింది. తుపాను ప్రభావంతో రాష్ట్రంలో రానున్న మూడు రోజులు ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఉత్తరాంద్రలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఇప్పటికే అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం వ్యాప్తంగా ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నిన్న (సోమవారం) రాత్రి నుంచి రామగిరి, చెన్నే కొత్తపల్లి, కనగానపల్లి మండలాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. అటు కనగానపల్లి చెరువుకు గండి పడటంతో పంటలకు భారీ నష్టం వాటిల్లింది. రామగిరి - ఎన్‌ఎస్ గేట్, ముత్తవకుంట్ల - కనగానపల్లి, తగరకుంట - కనగానపల్లి రహదారులన్నీ బ్లాక్ అయ్యాయి. ప్రసన్నయపల్లి నుంచి ఉప్పరపల్లి వరకు పండమేరు వాగు పరివాహక ప్రాంతాలు, కాలనీలు జలమయం అయ్యాయి.

తెలంగాణలో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీచే అవకాశముందని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని తెలిపింది. ఈ నెల 22, 23 తేదీల్లో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.

ఈ నెల 22న భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైద్రాబాద్, మేడ్చల్, మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశముందని తెలిపింది. 23న తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది.