New Delhi, September 12: కరోనా వ్యాక్సిన్ మీద ఆశలు ఆవిరవుతున్నాయి. నిన్నటిదాకా ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ (Oxford COVID-19 Vaccine) వస్తుందని అందరికీ ఆశలు రేగాయి. అయితే ఇప్పుడు ఈ ఆశలపై డీసీజీఐ నీళ్లు చల్లింది. భారత్‌లో నిర్వహించాల్సిన రెండవ, మూడవ దశ ఆక్స్‌ఫర్డ్ కోవిడ్ వ్యాక్సిన్ ట్రయల్స్‌ను (Phase 2, 3 COVID-19 Vaccine Clinical Trials) నిలిపివేయాలని సీరం ఇన్స్‌టిట్యూట్‌కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) (Drugs Controller General of India (DCGI) ఆదేశాలు జారీ చేసింది. ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ, ఆస్ట్రాజెన్‌కా సంయుక్తంగా కోవిడ్ వ్యాక్సిన్ తయారు చేస్తున్న సంగతి విదితమే.
అయితే ఇటీవల లండన్‌లో ఆ టీకా తీసుకున్న ఓ వాలంటీర్ అస్వస్థతకు లోనయ్యారు. దీంతో బ్రిటన్‌లో ఆ టీకా ట్రయల్స్‌ను ఆపేశారు. ఆక్స్‌ఫర్డ్‌తో కలిసి భారత్‌లో పూణెకు చెందిన సీరం ఇన్స్‌టిట్యూట్ కూడా ట్రయల్స్ నిర్వహిస్తున్నది. తక్షణమే ఇండియాలో ట్రయల్స్ ఆపేయాలని డీసీజీఐ కంట్రోలర్ జనరల్ సోమని ఆదేశాలు జారీ చేశారు. భారత్‌లో తొలి దశలో ఆక్స్‌ఫర్డ్ టీకా ఇచ్చిన వారిని మానిటర్ చేయాలని, దానికి సంబంధించిన ప్రణాళికను, నివేదికను సమర్పించాలని సీరం ఇన్స్‌టిట్యూట్‌కు డీసీజీఐ ఆదేశాలు ఇచ్చింది.
బ్రిటన్‌కు చెందిన డేటా అండ్ సేఫ్టీ మానిటరింగ్ బోర్డు ఇచ్చిన క్లియరెన్స్ సర్టిఫికెట్‌ను కూడా తమకు సమర్పించాలంటూ సోమాని తన లేఖలో సీరం సంస్థను కోరారు. ఆస్ట్రాజెన్‌కా సంస్థ ఇతర దేశాల్లో క్లినికల్ ట్రయల్స్ నిలిపివేసినట్లు తమకు సమాచారం ఇవ్వలేదని కూడా సీరం సంస్థకు డీసీజీఐ నోటీసులు ఇచ్చింది.