Jammu Kashmir, July 08: అమర్‌నాథ్ యాత్రలో విషాదం నెలకొంది. కుంభవృష్టి కారణంగా యాత్రికులు కకావికలమయ్యారు. అమర్‌ నాథ్ గుహ వద్ద సంభవించిన ఆకస్మిక వరదలతో...13 మందికి పైగా మృతి చెందారు. పదుల సంఖ్యలో యాత్రికులు గల్లంతయ్యారు. శుక్రవారం సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో అమర్‌నాథ్‌ గుహ (Amarnath Cave) ప్రాంతంలో ఒక్కసారిగా కుంభవృష్టి కురిసింది. దీంతో ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద ముంచెత్తింది. ఈ ప్రాంతంలో చిక్కుకున్న బాధితుల్ని రక్షించేందుకు కేంద్ర బలగాలు ప్రయత్నిస్తున్నాయి. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసుల (ITBP)తోపాటు ఇండియన్ ఆర్మీ(Indian Army), ఎన్డీఆర్ఎఫ్(NDRF) దళాలుసహా మొత్తం ఆరు బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. వరదల కారణంగా అమర్‌నాథ్‌ యాత్రను (Amrnath yatra) తాత్కాలికంగా నిలిపివేశారు. వాతావరణ పరిస్థితులు పూర్తిగా మెరుగైన తర్వాత తిరిగి యాత్ర ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు.

అమర్‌నాథ్‌ ప్రాంతంలో కుంభవృష్టిపై ప్రధాని మోదీ స్పందించారు. యాత్రికుల్ని కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ అంశంపై జమ్ము కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో(manoj sinha) మాట్లాడినట్లు వెల్లడించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఈ అంశంపై స్పందించారు. అక్కడ చిక్కుకున్న యాత్రికుల్ని కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. భక్తుల్ని కాపాడటమే తమ ప్రాధాన్యమని చెప్పారు.

ఈ వరదల కారణంగా అమర్‌నాథ్‌ వద్ద ఏర్పాటు చేసిన 25 టెంట్ల వరకు కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. సహాయక చర్యలను ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అమర్ నాథ్ యాత్రలో కుంభవృష్టికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ గా మారుతున్నాయి.