Tirumala, Oct 25: కాలినడకన తిరుమల వెళ్తున్నారా? అయితే తిరుమల తిరుపతి దేవస్థానం తాజాగా కొన్ని సూచనలు చేసింది. ఇటీవల తిరుమలకు కాలి నడకన (tirumala walking path) వచ్చిన భక్తుల్లో కొందరు అనారోగ్యానికి గురైన సంఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఈ రకమైన సూచనల వచ్చాయి. ఈ క్రమంలోనే కాలినడకన వచ్చి శ్రీవారి దర్శించుకోవాలనుకుంటున్న భక్తులకు టీటీడీ (TTD News) పలు సూచనలు చేసింది.
ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా.. వాళ్లు దయచేసి మెట్ల మార్గాన్ని ఎంచుకోకూడదు? ఒకవేళ రావాల్సి వస్తే, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వైద్య సదుపాయాలు ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయి? అన్న విషయాలను టీటీడీ పాలకమండలి తెలిపింది. 60 ఏళ్లు దాటిన వృద్ధులు, మధుమేహం, అధిక రక్తపోటు, ఉబ్బసం, మూర్ఛ, కీళ్ల వ్యాధులు ఉన్న భక్తులు తిరుమలకు కాలినడకన రావడం మంచిది కాదని తెలిపింది.
ఊబకాయంతో బాధపడుతున్న భక్తులు, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు తిరుమల కొండకు నడక దారిన రావడం శ్రేయస్కరం కాదు. తిరుమల కొండ సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉండటం కారణంగా ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉంటుంది. కాలినడకన రావడం చాలా ఒత్తిడితో కూడుకున్న విషయం కాబట్టి గుండె సంబంధిత వ్యాధులు, ఉబ్బస వ్యాధిని తీవ్రతరం చేసే అవకాశం ఉంది భక్తులు తదనగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.
దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న భక్తులు వారి రోజు వారి మందులు వెంట తెచ్చుకోవాలి. అలాగే కాలినడకన వచ్చే భక్తులకు ఏమైనా సమస్యలు ఎదురైతే అలిపిరి కాలిబాట మార్గంలోని 1500 మెట్టు, గాలి గోపురం, భాష్యకార్ల సన్నిధి వద్ద వైద్య సహాయం పొందవచ్చని తెలిపింది. దీంతో పాటుగా తిరుమలలోని ఆశ్వినీ ఆస్పత్రి, ఇతర వైద్యశాలల్లో 24×7 వైద్య సదుపాయం అందుబాటులో ఉంది. దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అత్యవసర పరిస్థితుల్లో తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో డయాలసిస్ సౌకర్యం కల్పిస్తున్నాం అని టీటీడీ తెలిపింది.