Nirbhaya case convicts | File Image

New Delhi, March 5:  2012 నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో (2012 Delhi Gangrape Murder Case) దోషులకు దిల్లీ పాటియాల హౌజ్ కోర్టు (Delhi Court) గురువారం తాజా డెత్ వారెంట్ (Death Warrant)  జారీ చేసింది. కోర్టు విడుదల చేసిన బ్లాక్ వారెంట్ ప్రకారం, 2020 మార్చి 20, తెల్లవారుజామున 5:30 గంటలకు తీహార్ సెంట్రల్ జైలులో ఉరిశిక్ష అమలు చేయబడుతుంది.

ఈ కేసులో దోషులుగా తేలిన ముఖేష్ సింగ్ (32), వినయ్ శర్మ (26), పవన్ గుప్తా (26), అక్షయ్ సింగ్ ఠాకూర్ (29) అనే నలుగురికి ఉరి శిక్ష ఖరారైంది. ఈ ఏడాది మొదటి నెలలోనే వీరిని ఉరి తీయాల్సింది, అయితే దోషులు తమకున్న న్యాయ పరమైన అవకాశాలతో ఉరిశిక్ష తేదీని పొడగించుకుంటూ వచ్చారు. చివరి నిమిషంలో దోషులు ఒక్కొక్కరు విడివిడిగా రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టుకున్నారు. దీంతో జనవరి 22న, ఫిబ్రవరి 01న ఆపై మార్చి 03న ఇలా మూడు సార్లు డెత్ వారెంట్లు జారీ చేయబడి అటు తర్వాత వాయిదా వేయబడ్డాయి. 'నేనొక మానసిక రోగిని, ఉరితీయకూడదు' నిర్భయ దోషి వాదన, స్పృహ తప్పిన న్యాయమూర్తి

ఎట్టకేలకు ఈ నలుగురు దోషులకు ఉన్న అన్ని న్యాయపరమైన అవకాశాలు ఇప్పుడు సంపూర్ణంగా ముగిసిపోయాయి. దీంతో దిల్లీ ప్రభుత్వం ఈ విషయాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చింది. వీరిని ఉరి తీసేందుకు డెత్ వారెంట్ జారీ చేయాలని కోరుతూ దిల్లీ పాటియాల కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దోషుల తరఫున వాదించే న్యాయవాది ఏపీ సింగ్ కి కూడా ఇప్పుడు వీరి ఉరిశిక్ష నిలుపుదల చేసేందుకు ఎలాంటి దారులు లేవని కోర్టుకు తెలిపింది. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం, తదనుగుణంగా డెత్ వారెంట్ జారీ చేసింది.   డెత్ వారెంట్ జారీ చేయడానికి ఇంకా 15 రోజులు ఆలస్యం ఎందుకు? ఎందుకంటే..!

ఏది ఏమైనా ఉరిశిక్ష తప్పించుకోవడానికి దోషులు చేయని ప్రయత్నం లేదు, ఆడని నాటకం లేదు. భారత న్యాయ వ్యవస్థలో ఒక నిర్దోషిని కాపాడటం కోసం చేర్చబడిన అవకాశాలన్నీ నిర్భయ దోషులు తమకు అనుకూలంగా మార్చుకొని తమ శిక్షను కొన్నాళ్ల పాటు పొడగించుకుంటూ పోయారు. ప్రతీ దానికి ఒక అంతం ఉన్నట్లే వీరి ఆట కూడా కడకు చేరింది. అనూహ్య పరిణామాలేమైనా చోటు చేసుకుంటే మినహా మార్చి 20న వీరికి ఉరితీత ఈ సారి వాయిదా పడే అవకాశం లేదు.