New Delhi, August 13: దేశీయ విమాన ప్రయాణాలు ఇకపై మరింత ఖరీదు కానున్నాయి. డొమెస్టిక్ విమానయాన కనిష్ఠ మరియు గరిష్ఠ ఛార్జీలను కేంద్ర ప్రభుత్వం మరోసారి పెంచింది. సెకండ్ వేవ్ కోవిడ్19 తర్వాత సడలింపులు లభించడంతో ప్రయాణాలు పెరిగాయి. ఇంతకాలంగా లాక్డౌన్ కారణంగా ప్రయాణాలు లేకపోవడం, అలాగే ఇంధన ధరలు కూడా పెరుగుతుండటంతో పలు విమాన సంస్థలు భారీగా నష్టపోయాయి. వాటిని గట్టెక్కించటానికి కేంద్ర పౌర విమానయాన శాఖ ప్రజలపైనే భారాన్ని మోపుతూ విమాన ఛార్జీలు పెంచింది. ఈ ఏడాదిలో పెంపు ఇది నాలుగో సారి కావడం గమనార్హం.
అధికారిక ఉత్తర్వుల ప్రకారం డొమెస్టిక్ విమాన ఛార్జీలు 9.83 నుండి 12.82 శాతం వరకు పెంచబడ్డాయి. ప్రయాణించే వ్యవధి ఆధారంగా కనిష్ఠ మరియు గరిష్ఠ ఛార్జీలు ఉండనున్నాయి. ఛార్జీల పెంపుతో పాటు దేశీయ విమాన షెడ్యూల్‌లపై సామర్థ్యం పరిమితిని కూడా కేంద్ర ప్రభుత్వం 65% నుండి 72.5% కి పెంచింది. దీని ప్రకారం, విమానయాన సంస్థలు ఇప్పుడు నిర్ధేషిత మార్గాల్లో విమాన సర్వీసుల సంఖ్యను కూడా పెంచుకోవచ్చు.
తాజా ఉత్తర్వుల ప్రకారం, 40 నిమిషాల ప్రయాణ వ్యవధి గల విమాన సర్వీసుల్లో కనిష్ఠ ఛార్జీ రూ. 2,900 కి పెంచగా, గరిష్ఠ ఛార్జీ రూ. 8,800 కి పెరిగింది.
అదే విధంగా, 40-60 నిమిషాల మధ్య వ్యవధి ఉన్న విమాన సర్వీసుల్లో కనిష్ఠ ఛార్జీ రూ. 3,700, గరిష్ఠంగా రూ .11,000 కి పెరిగింది.
60-90 నిమిషాల మధ్య వ్యవధి కలిగిన విమానాల్లో కనిష్ఠ ఛార్జీ రూ. 4,500, గరిష్ఠ ఛార్జీ రూ. 13,200 కి పెరిగింది.
అలాగే, 90 నుంచి 120, 120 నుంచి 150, 150 నుంచి 180 మరియు 180 నుంచి 210 నిమిషాల ప్రయాణ సమయం గల డొమెస్టిక్ విమాన సర్వీసుల్లో కనిష్ఠ ఛార్జీలు వరుసగా రూ. 5,300, రూ .6,700, రూ .8,300 మరియు రూ. 9,800 వరకు పెరిగాయి.
ఈ పెరిగిన ఛార్జీలకు అదనంగా ప్యాసింజర్ సెక్యూరిటీ ఫీజు, ఎయిర్‌పోర్టుల కోసం యూజర్ డెవలప్‌మెంట్ ఫీజు మరియు జీఎస్‌టి వర్తిస్తాయి. ప్రయాణీకులు టికెట్ బుక్ చేస్తున్నప్పుడు ఈ అదనపు ఛార్జీలు జోడించబడతాయి.
కోవిడ్ ఆంక్షల కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విమానయాన సంస్థలకు సహాయం చేయడానికి కేంద్రం ఇలా కనిష్ఠ ఛార్జీలను నిర్ధేషించింది. అలాగే, డిమాండ్ ఎక్కువగా ఉన్న సమయాల్లో ప్రయాణికుల నుంచి భారీ మొత్తాలు వసూలు చేయబడకుండా, గరిష్ఠ ఛార్జీల పరిమితిని విధించింది. ఏదైమైనా ఇకపై విమానయానం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అవుతుంది, సాధారణ మధ్య తరగతి ప్రజలు ఇకముందు విమాన ప్రయాణం చేయాలంటే హడలిపోయే పరిస్థితి తలెత్తే అవకాశాలున్నాయి.