New Delhi, February 24: దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన (Donald Trump India visit), ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో (Narendra Modi) భేటీ మరియు ఇరు దేశాలకు సంబంధించిన ద్వైపాక్షిక సమావేశానికి సమయం ఆసన్నమైంది. నిన్ననే అమెరికా నుంచి బయలుదేరిన ట్రంప్ మరికొద్ది సేపట్లో భారత్ లోని అహ్మదాబాద్ (Ahmedabad) నగరానికి చేరుకోనున్నారు. డొనాల్డ్ ట్రంప్ కు ఇది తొలి భారత పర్యటన. నేడు, రేపు రెండు రోజుల పాటు ఆయన పర్యటన సాగనుంది. ఫిబ్రవరి 24న తొలి రోజు గుజరాత్ రాష్ట్రంలోపర్యటిస్తారు. ఇక్కడ స్వాగత కార్యక్రమాలు, సభ మరియు ఇతర కార్యక్రమాలు ముగిసిన తర్వాత సాయంత్రం ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా చేరుకుంటారు. ఇక రెండో రోజు అంటే ఫిబ్రవరి 25న ఆయన పూర్తిగా దిల్లీలో గడపనున్నారు. ఈరోజు కీలక సమావేశాలు జరగనున్నాయి.
డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన యొక్క పూర్తి షెడ్యూల్ - తేదీ, సందర్శించే స్థలాలు, సమావేశమయ్యే వేదికలు ఈ విధంగా ఉండనున్నాయి.
ఫిబ్రవరి 24 - భారత పర్యటన తొలి రోజు
సోమవారం మధ్యాహ్నం మధ్యాహ్నం సుమారు 12 గంటల సమయానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు ఆయన సతీమణి, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు.
విమానాశ్రయంలో ప్రధాని మోదీ వారికి స్వాగతం పలుకుతారు. అక్కడే అగ్రరాజ్య నేతకు గార్డ్ ఆఫ్ ఆనర్ ఇవ్వబడుతుంది , ఆ తర్వాత విశిష్ట అతిథుల కోసం ఏర్పాటు చేసిన చిన్న సాంస్కృతిక కార్యక్రమం ఉంటుంది.
ఆ తర్వాత పీఎం మోదీ, అధ్యక్షుడు ట్రంప్, ప్రథమ మహిళ మెలానియా కలిసి అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించనున్నారు. భారత రోడ్లపై అమెరికా ప్రెసిడెంట్ కార్ రయ్ రయ్
అనంతరం కొత్తగా నిర్మించిన మొతెరా స్టేడియం వైపు బయలుదేరుతారు. అహ్మదాబాద్ వీధుల్లో రోడ్డుకు ఇరువైపులా లక్షలాది మంది జేజేలతో గ్రాండ్ రోడ్‌షో ఉంటుంది. అనంతరం మొతెరాలో నిర్మించబడుతున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియంను ప్రధాని మోదీ, యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ సంయుక్తంగా ప్రారంభిస్తారు. ఈ స్టేడియం లక్ష మందికి పైగా కూర్చునే సామర్థ్యం కలిగిన ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా అవతరించనుంది.
మొతెరా స్టేడియంలో ‘నమస్తే ట్రంప్' (Namaste Trump) ఈవెంట్ జరగనుంది. లక్షలుగా తరలివచ్చే జనాలను ఉద్దేశించి పీఎం మోదీ, అధ్యక్షుడు ట్రంప్ ప్రసంగించనున్నారు.
షెడ్యూల్ ప్రకారం, ప్రెసిడెంట్ ట్రంప్ మధ్యాహ్నం 3:30 గంటలకు ఆగ్రాకు బయలుదేరుతారు. సాయంత్రం 4:30 గంటలకు ఆగ్రా చేరుకుంటారు. వారికి ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆహ్వానం పలుకుతారు.
సాయంత్రం 5 గంటలకు తాజ్ మహల్ సందర్శన, అరగంట తాజ్‌మహల్ వద్ద గడిపి, అక్కడ్నించి నేరుగా దిల్లీ బయలుదేరి వెళ్తారు. అయితే భద్రతా కారణాల రీత్యా ట్రంప్ ఈరోజు పర్యటనలో మార్పులకు అవకాశం ఉంది. అధికారులు ఈ వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు.
ఫిబ్రవరి 25 - భారత పర్యటన రెండవ రోజు
ఇండియా- యూఎస్ ద్వైపాక్షిక సమావేశాలు జరుగుతాయి. అమెరికా అధ్యక్షుడి రాకను పురస్కరించుకొని ఉదయం 9 గంటలకు రాష్ట్రపతి భవన్ ఎదుట స్వాగత ఉత్సవం జరుగుతుంది. అనంతరం డొనాల్డ్ ట్రంప్ మహాత్మా గాంధీ స్మారక చిహ్నం రాజ్‌ఘాట్ సందర్శన ఉంటుంది. రాజ్‌ఘాట్ వద్ద మహత్మా గాంధీకి ట్రంప్ 1 నిమిషం పాటు నివాళులు అర్పిస్తారని నివేదికలు పేర్కొన్నాయి.
అనంతరం, అసలైన కార్యక్రమం- దిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో డొనాల్డ్ ట్రంప్ మరియు నరేంద్ర మోదీల అధికారిక భేటీ ఉంటుంది. ఇరు దేశాల ద్వైపాక్షిక సమావేశం, వన్ టు వన్ సమావేశం, ద్వైపాక్షిక ప్రతినిధుల స్థాయి చర్చలు జరగనున్నాయి.
హైదరాబాద్ హౌస్‌లోనే మధ్యాహ్నం భోజనం ఏర్పాటు ఉంటుంది.
లంచ్ తర్వాత ట్రంప్ దంపతులు దిల్లీలోని ఐటీసీ మౌర్య హోటల్‌లో బస చేస్తారు. అక్కడే కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం మౌర్య హోటల్‌లోనే ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, ట్రంప్‌తో సమావేశం కానున్నట్లు నివేదికలు తెలిపాయి.
సాయంత్రం 4:30 గంటలకు అమెరికా రాయబార కార్యాలయ సిబ్బంది అధ్యక్షుడు ట్రంప్ ను కలవనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కోసం అమెరికా రాయబార కార్యాలయంలో రిసెప్షన్ కార్యక్రమాన్ని ప్లాన్ చేశారు.
దేశానికి వచ్చిన అతిథుల కోసం రాత్రి 7 గంటలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ విందు ఇవ్వనున్నారు. రాష్ట్రపతి భవన్‌లో ఈ విందు కార్యక్రమం జరగనుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ సహా మరో 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఈ విందుకు ఆహ్వానం అందింది. ఈ విందు తర్వాత అమెరికా అధ్యక్షుడి భారత పర్యటన పూర్తవుతుంది.
రాత్రి 10 గంటలకు డొనాల్డ్ ట్రంప్ తిరిగి అమెరికా బయలుదేరుతారు.